Begin typing your search above and press return to search.

బీహార్ ఎన్నికల నుండి 27 మంది అవుట్ .. అనర్హులుగా ప్రకటించిన ఈసీ!

By:  Tupaki Desk   |   3 Oct 2020 11:10 AM GMT
బీహార్ ఎన్నికల నుండి 27 మంది అవుట్ .. అనర్హులుగా ప్రకటించిన ఈసీ!
X
అతి త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలోనే ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 27 మంది రాజకీయ నేతలకి షాక్ ఇచ్చింది. ఈ 27 మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులను చెప్పింది. ఈ అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం అన్ని జిల్లాలకు పంపింది. ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 10 (ఎ) ప్రకారం వీరు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించబడ్డారు. వీరంతా 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినవారు అని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో కుధాని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకంగా 5 మంది రాజకీయ నాయకులు ఉన్నారు.

దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలలో నిషేధించబడిన వ్యక్తుల సంఖ్య ఆధారంగా, బీహార్ 8 వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌ లో గరిష్టంగా 332 మందిని నిషేధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ‌లో 124 , కేరళ 111 , కర్ణాటక 80 , అస్సాం 49 , తెలంగాణ 47 , ఉత్తరాఖండ్ 40 , బీహార్, గుజరాత్లలో 27 మంది ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులని తేల్చారు. 2020 జనవరి నాటికి బీహార్‌లో 89 మంది ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. వీరిలో 62 మందికి మూడేళ్ల నిషేధ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముగిసింది. ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 10 (ఎ) ప్రకారం, ఒక వ్యక్తి ఎన్నికల ఖర్చుల వివరాలను ఫలితం ఇచ్చిన 30 రోజులలోపు ఇవ్వకపోతే లేదా వివరాలు ఇవ్వకపోవటానికి ఎటువంటి సహేతుకమైన కారణం చెప్పకపోతే , ఎలక్షన్ కమిషన్ అతనికి మూడేళ్ల నిషేధ కాలపరిమితిని విదిస్తుంది. దీంతో వారు మూడేళ్లవరకు ఎటువంటి ఎన్నికలలో పోటీచేయలేరు..

ఇకపోతే , బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే .. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమి బ్యానర్‌పై పోటీ చేశాయి. బీజేపీ సారథ్యంలని ఎన్డీయే ఎల్‌జేపీ, ఇతర భాగస్వాములతో కలిసి పోటీ చేసింది. ఆర్జేడీ 80 సీట్లు గెలుచుకుని పెద్ద పార్టీగా నిలబడగా, జేడీయూ 71, బీజేపీ 53 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీకి 24.42 శాతం ఓట్ల షేర్ రాగా, ఆర్జేడీ ఓటింగ్ షేర్ 18.35, జేడీయూ ఓటింగ్ షేర్ 16.83 శాతంగా ఉంది. అనంతర క్రమంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు రావడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయేలో చేరి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.