Begin typing your search above and press return to search.

కొవిడ్ బాధిత కుటుంబాల్లో.. మాన‌సిక క‌ల్లోలం!

By:  Tupaki Desk   |   30 May 2021 1:30 AM GMT
కొవిడ్ బాధిత కుటుంబాల్లో.. మాన‌సిక క‌ల్లోలం!
X
మ‌న‌కు దెబ్బ త‌గిలితే నొప్పిని మాత్ర‌మే ఫీల‌వుతాం.. కానీ, మ‌న‌వాళ్ల‌కు త‌గిలితే మ‌నం న‌ర‌కం చూస్తాం. వాళ్ల మీద మ‌న‌కు ఎంత ప్రేమ ఉంటే.. అంత బాధ‌ను అనుభ‌విస్తాం. వారు కోలుకునే వర‌కు ఆ వేద‌న వ‌దిలిపెట్ట‌దు. అలాంటిది.. వారు ప్రాణాలే కోల్పోతే? అందుకు ప‌రోక్షంగా మ‌న‌మే కార‌ణం అయితే..? ఆ వేద‌న మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. ఎవ‌రికీ చెప్ప‌లేనిది.. ఎవ‌రూ అర్థం చేసుకోలేనిది. కేవ‌లం అనుభ‌వించే వారికి మాత్ర‌మే తెలుస్తుంది. ఇప్పుడు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఈ ప‌రిస్థితి పెరుగుతున్న‌ట్టు నిపుణులు గుర్తిస్తున్నారు.

ఇటీవ‌ల ఓ యువ‌కుడికి క‌రోనా సోకింది. ఎలా వ‌చ్చిందో తెలియ‌దు. కానీ.. త‌న‌తోపాటు ఇంట్లోని వారికీ పాకింది. అంద‌రూ కోలుకున్న‌ప్ప‌టికీ.. త‌న సోద‌రి మాత్రం బ‌లైపోయింది. దీంతో.. స‌ద‌రు యువ‌కుడు తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు. త‌న‌వ‌ల్లే త‌న సోద‌రి ప్రాణాలు కోల్పోయింద‌ని, ప‌రోక్షంగా ఈ దారుణానికి తానే కార‌ణ‌మ‌య్యాన‌ని కుమిలిపోసాగాడు. రోజులు గ‌డిచే కొద్ది ఈ మానోవ్య‌థ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోవ‌డంతో.. ఆసుప‌త్రి పాల‌వ‌వ్వాల్సి వ‌చ్చింది.

ఇది కేవ‌లం ఈ ఒక్క‌డి యువ‌కుడి ప‌రిస్థితి కాదు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా చోటు చేసుకుంటున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. మాన‌సికంగా ఇలాంటి ఇబ్బంది అనుభ‌విస్తున్న వారిని వెంట‌నే గుర్తించాల‌ని సూచిస్తున్నారు. ఎవ్వ‌రితోనూ మాట్లాడ‌కుండా.. నిత్యం నిరుత్సాహంలో, ముభావంగా ఉండేవారిని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఆ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌కు తేవాల‌ని సూచిస్తున్నారు. లేదంటే.. కండీష‌న్‌ మ‌రింత ఇబ్బందిక‌రంగా త‌యార‌వుతుంద‌ని సూచిస్తున్నారు.

తామే ఇంట్లోకి క‌రోనా తీసుకొచ్చామ‌ని బాధ‌ప‌డే వారి ఆరోగ్యంపై ఈ ఆలోచ‌న‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటోంద‌ని చెబుతున్నారు. అప్ప‌టికే వైర‌స్ తో బాధ‌ప‌డుతున్న వారిని.. ఈ ఆవేద‌న మ‌రింత‌గా కుంగ‌దీస్తోంద‌ని, ఈ ప‌రిస్థితి ఇమ్యూనిటీపై ఎఫెక్ట్ చూపిస్తోంద‌ని చెబుతున్నారు. అందువ‌ల్ల ప‌క్క‌న ఉన్న‌వారు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు వారికి వాస్త‌వాన్ని అర్థం చేయించ‌డంతోపాటు ధైర్యం చెప్పాల‌ని చెబుతున్నారు. అయినా మార్పు రాక‌పోతే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు.