Begin typing your search above and press return to search.

మోడీ 'జై' నామకరణం.. ఎందుకంటే..

By:  Tupaki Desk   |   1 Dec 2018 7:18 AM GMT
మోడీ జై నామకరణం.. ఎందుకంటే..
X
అర్జెంటీనా దేశంలో జీ20 దేశాల సమావేశం జరుగుతోంది. ఇందులో భారత్ - అమెరికా - జపాన్ సహా అభివృద్ధి చెందిన దేశాల అధ్యక్షులు - ప్రధానలు పాల్గొంటున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ - జపాన్ ప్రధాని షింజో అబేలతో సమావేశమయ్యారు. ముగ్గురు అగ్ర నాయకులు కలిసిన ఈ సమావేశానికి ‘జై’ అని భారత ప్రధాని నామకరణం చేశారు. జై అంటే జపాన్ - అమెరికా - ఇండియా దేశాల తొలి ఆంగ్ల ఆక్షరాలను కూడితే వస్తుందని.. హిందీలో ‘జై’ అంటే విజయం అని భారత ప్రధాని సమావేశానికి ఉన్న ప్రాధాన్యతను నొక్కిచెప్పారు.

మోడీ - ట్రంప్ - అబే లు ప్రధానంగా అభివృద్ధిపై చర్చించాయి. మోడీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం మూడు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రతిజ్ఞ చేసినట్లు చెప్పారు. శాంతి కోసం 5 పాయింట్లను ఆమోదించామని.. ఒకరితో ఒకరు అనుసంధానం - స్థిరమైన అభివృద్ధి - విపత్తు ఉపశమనం - సముద్ర భద్రతలపై కలిసి సాగడానికి నిర్ణయించామని ప్రధాని మోడీ వివరించారు.

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. మూడు దేశాల మధ్య బంధం బలపడిందని పేర్కొన్నారు. భారత్ -అమెరికా కలిసి పనిచేస్తున్నాయని.. భారత్ - అమెరికా వాణిజ్యరంగంలో రాణిస్తున్నాయని చెప్పారు. రక్షణ - మిలటరీ రంగం - ఆయుధాల కొనుగోళ్ల విషయంలో పరస్పరం సహకరించుకుంటామని చెప్పారు. ఇక జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. ఇండో పసిఫిక్ దేశాలను అభివృద్ధి పథం వైపు నడుపుతామని ఆశాభావం వ్యక్తంచేశారు.

అమెరికా - భారత్ - జపాన్ భేటిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మూడు దేశాలు కలిసిపోవడం చైనాకు శరాఘాతంగా మారింది. కొద్దికాలంగా చైనా దక్షిణ చైనా సముద్రం - జపాన్ లోని తూర్పు చైనా సముద్రం తమదేనంటూ ఆదిపత్యం చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు దేశాల మధ్య చర్చలు జరగడం చైనాకు చెక్ చెప్పేందుకే అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. చైనా దక్షిణ చైనా సముద్రంపై ఆక్రమణ వల్ల ఏటా 3 ట్రిలియన్ అమెరికా డాలర్ల వ్యాపార నష్టం వాటిల్లుతోంది. అంతేకాక ఆ సముద్రంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద - చమురు - సహజవాయు నిక్షేపాలను చైనా తమదే అంటోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు చెక్ చెప్పేందుకు ఈ మూడు దేశాల భేటి అన్న ప్రచారం జరుగుతోంది.