Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో ఆ ముఖ్యమంత్రి ఆస్తులు అంతలా తగ్గాయట!

By:  Tupaki Desk   |   26 March 2021 5:38 AM GMT
ఐదేళ్లలో ఆ ముఖ్యమంత్రి ఆస్తులు అంతలా తగ్గాయట!
X
నేతలు ఎవరైనా కావొచ్చు. ఎన్నికల సందర్భంగా తమకున్న ఆస్తుల్ని రివీల్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల సందర్భంగా వారు తమ ఆస్తులు.. అప్పులకు సంబంధించిన వివరాల్ని అఫిడవిట్ రూపంలో ఎన్నికల కమిషన్ కు ఇవ్వటం తెలిసిందే. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరే రాష్ట్రంలో లేని రీతిలో.. పశ్చిమబెంగాల్ సీఎం ఆస్తులు ఐదేళ్ల వ్యవధిలో భారీగా తగ్గిపోయిన వైనం బయటకు వచ్చింది.

గత ఎన్నికల సందర్భంగా ఆమె తన ఆస్తుల విలువను రూ.30.45 లక్షలుగా చూపిస్తూ డిక్లరేషన్ ఇచ్చారు. తాజాగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమత తన ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తూ.. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. ఆమె ఆస్తులు సగానికి సగం వరకు తగ్గినట్లుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.16.72 లక్షలుగా పేరర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆమె భవానీ నగర్ లో పోటీ చేస్తే.. తాజాగా నందిగ్రామ్ లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆమెపార్టీలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న సవేందు బీజేపీలోకి వెళ్లటం.. అతడు బరిలో దిగే నియోజవర్గం నుంచే పోటీ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. మరో ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏమంటే.. మమత పార్టీకి చెందిన నేతల పలువురి ఆస్తులు తగ్గినట్లుగా తమ అఫిడవిట్ లో పేర్కొనగా.. అదే సమయంలో సీపీఎంకు చెందిన మరికొందరి నేతల ఆస్తులు భారీగా పెరిగిన వైనం బయటకు వచ్చింది. ఆ పార్టీకి చెందిన షేక్ ఇబ్రహీం ఆస్తుల విలువ గత ఎన్నికలతో పోలిస్తే 2141 శాతం పెరగటం గమనార్హం. ఐదేళ్లలో అత్యధికంగా ఆస్తుల విలువ పెరిగిన అభ్యర్థుల్లో ఆయన తొలి స్థానంలో నిలవటం విశేషం. 2016లో ఆయన ఆస్తుల విలువ రూ.49,730గా పేర్కొంటే.. తాజాగా మాత్రం రూ.10.64 లక్షలుగా పేర్కొన్నారు. ఇదంతా ఓకే కానీ.. సీఎంగా ఉన్న దీదీ ఆస్తులు ఎందుకు తగ్గినట్లు? అన్నది మాత్రం ప్రశ్నగా మారింది.