Begin typing your search above and press return to search.

అమెరికా విదేశాంగ మంత్రి ఎదుటే.. అమెరికన్ పాత్రికేయులకు కేంద్రమంత్రి పంచ్

By:  Tupaki Desk   |   13 April 2022 3:01 AM GMT
అమెరికా విదేశాంగ మంత్రి ఎదుటే.. అమెరికన్ పాత్రికేయులకు కేంద్రమంత్రి పంచ్
X
తన దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సై అనే తత్త్వం అగ్రరాజ్యం అమెరికా ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఆ సందర్భంగా తొండి వాదనను సైతం అందంగా వినిపించే అలవాటు ఆ దేశం సొంతం. అలాంటిది.. ప్రపంచంలోని ఇతర దేశాలు మాత్రం తమ దేశ ప్రయోజనాల కోసం ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే వెంటనే.. పెద్దన్న తరహాలో వ్యాఖ్యలు చేయటం.. కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేయటమే కాదు.. అవసరమైతే వార్నింగ్ ఇచ్చేందుకు సైతం వెనకాడని తత్త్వం ఆ దేశానికి ఎక్కువే.

తన దేశం..తన ప్రజలు మాత్రమే ముఖ్యమని భావించే అమెరికాకు తగ్గట్లే.. ప్రతి దేశానికి అలాంటి ప్రాధాన్యాలే ఉంటాయనే విషయాన్ని ఒప్పుకునేందుకు ససేమిరా అనే తీరు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత విదేశీ విధానాన్ని చాటి చెప్పే క్రమంలో కేంద్ర మంత్రి జై శంకర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. రాత్రికి రాత్రే ఆయనకు పెద్ద ఎత్తున అభిమానుల్ని తయారు చేసింది. దీనికి కారణం అమెరికా వేదికగా సాగిన ఒక మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ముందు.. భారత ప్రయోజనాల్ని బలంగా వినిపించటమే కాదు.. ఈ సందర్భంగా గణాంకాల పేరుతో దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చిన క్రెడిట్ ఆయన సొంతంగా చెప్పాలి.

ఉక్రెయిన్ - రష్యా మధ్య నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు మీద పెద్ద ఎత్తున ఆంక్షలు వ్యక్తం చేస్తున్న అమెరికా తీరుకు భిన్నంగా.. భారత్ తనకు అవసరమైన చమురును కొనుగోలు చేయటానికి పుతిన్ సర్కారుకు ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే. దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. భారత్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ మోడీ సర్కారు ముందు మా దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. విదేశాంగ మంత్రి జై శంకర్ తదితరులు అమెరికా రక్షణ.. విదేశాంగ మంత్రులతో కలిసి 2+2 మంత్రుల స్థాయి చర్చలు నిర్వహించారు. వీరి భేటీ అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అమెరికా మీడియాకు చెందిన పాత్రికేయుడు ఒకరు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై ఇరుకున పెట్టేలా ప్రశ్నను సంధించారు.దీనికి బదులిచ్చే క్రమంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ దిమ్మ తిరిగేలాతన వాదనను సింపుల్ గా.. సూటిగా వినిపించారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురుకు సంబంధించిన గణాంకాల్ని చూస్తే.. మేం ఒక నెలలో చేసే కొనుగోళ్ల మొత్తం విలువ.. యూరోప్ దేశాలు ఒక పూట (ఒక మధ్యాహ్నం పూట) రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు కన్నా తక్కువన్నారు. కాబట్టి చమురు కొనుగోలుపై భారత్ తీరుపై వేలెత్తి చూపించే ముందు.. యూరోప్ విషయంలో ఫోకస్ చేస్తే మంచిదన్న కౌంటర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అంతర్జాతీయ మీడియా ముందు.. అందునా అమెరికన్ పాత్రికేయులతో అమెరికా విదేశాంగ మంత్రి ముందు ఈ తరహా వ్యాఖ్య చేయటం మామూలు విషయం కాదన్న మాట వినిపిస్తోంది. మా దేశ ప్రయోజనాలు.. మాకు చాలా ముఖ్యమన్న విషయాన్ని కుండ బద్ధలు కొట్టిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మా ఇంధన భద్రత మాకుచాలా ముఖ్యమన్న విషయాన్ని జై శంకర్ చెప్పిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గణాంకాల ఆధారంగా సుతిమెత్తగా చురకలు అంటించిన ఆయన తీరును బీజేపీకి బద్ధ శత్రువుగా మారిన ఒకనాటి మిత్రుడు శివసేన నేతలు సైతం ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏమైనా..దేశ ప్రయోజనాల గురించి సరైన రీతిలో గళం విప్పిన కేంద్ర మంత్రి జై శంకర్ ను చూసినప్పుడు ఎన్నాళ్లకు ఒక నేత అమెరికా గడ్డ మీద తన సత్తాను చాటారని చెప్పక తప్పదు.