Begin typing your search above and press return to search.

లంచాల్లో కొత్త కరెన్సీ మిళమిళ

By:  Tupaki Desk   |   17 Nov 2016 7:52 AM GMT
లంచాల్లో కొత్త కరెన్సీ మిళమిళ
X
పిల్ల చచ్చినా పురిటి కంపు పోలేదని పల్లెల్లో మోటు సామెత ఒకటి వాడుతుంటారు. నోట్ల రద్దు వ్యవహారం అచ్చంగా అలాగే ఉంది. నల్లధనం - నకిలీ నోట్లు - అవినీతి అన్నిటినీ రూపుమాపడానికి బ్రహ్మాస్త్రమంటూ మొదలుపెట్టిన నోట్ల రద్దు వ్యవహారం జనాన్ని అష్టకష్టాల పాలు చేయడం తప్ప ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. దేశంలో కరెన్సీ ఫ్లో తగ్గిపోతే అవినీతి తగ్గుతుందని మోడీ ఆశలు పెట్టుకున్నా అలాంటి సూచనలే కనిపించడం లేదు. పాతనోట్లు పోయినా అవినీతి మాత్రం ఆగడం లేదు. కొత్త రూ.2 వేల నోట్లతో కొత్తగా దందా మొదలుపెట్టేశారు అవినీతిపరులు.

పీవీ నరసింహరావును మించిపోయే ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనే ఆయన ఆర్థిక ఎత్తుగడలకు తూట్లు పొడుస్తున్నారు. అవినీతి, నల్లధనం నిరోధానికి 2 వేల నోట్లు ప్రవేశపెట్టినట్లు చెబుతున్నా అవే 2 వేల నోట్లతో రూ.2.90 లక్షలు లంచంగా అందుకున్నారు ఇద్దరు అధికారులు. వారానికి 24 వేలకు మించి డ్రా చేయడానికి అనుమతి లేని ఇంత టైట్ టైమ్ లో కూడా లంచం ఇచ్చే వ్యక్తి అంత మొత్తాన్నీ అరేంజ్ చేసేశాట.

గుజరాత్ లోని పోర్టు ట్రస్టు నుంచి ఓ సంస్థకు అనుమతులు కావాలి. అనుమతులు ఇవ్వడానికి ఇద్దరు అధికారులు లంచం అడిగారు. సదరు సంస్థ కూడా లంచం ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే... పాతకరెన్సీ రద్దు అయింది కాబట్టి కొత్త కరెన్సీ కావాలన్నారు ఆ అధికారులు. సదరు సంస్థ ఆ మేరకు వారికి 2.9 లక్షల విలువ చేసే 145 ఫెళఫెళలాడే రూ.2 వేల నోట్లు ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అవినీతి ఒకెత్తయితే అంతమొత్తం ఎలా విత్ డ్రా చేశారన్నది కూడా ఏసీబీకి అంతుచిక్కడం లేదు. ఇదంతా ఎలా ఉన్నా కొత్త నోట్లతో అవినీతి దందాలు సరికొత్తగా మొదలయ్యాయని మాత్రం అర్థమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/