Begin typing your search above and press return to search.

హిమాచ‌ల్ ఎన్నిక‌ల్లో 'యాపిల్ పాలిటిక్స్‌' సెగ పుట్టిస్తోందిగా!

By:  Tupaki Desk   |   7 Nov 2022 11:30 PM GMT
హిమాచ‌ల్ ఎన్నిక‌ల్లో యాపిల్ పాలిటిక్స్‌  సెగ పుట్టిస్తోందిగా!
X
అదేంటి అనుకుంటున్నారా? నిజ‌మే. ఈ దేశంలో ఉల్లిపాయ‌లు.. ధాన్యం.. రాజ‌కీయాలను శాసించి.. ప్ర‌భుత్వాల‌ను ప‌డేసిన సంద‌ర్భాలు తెలిసిందే. ఢిల్లీలో సుష్మా స్వ‌రాజ్ స‌ర్కారు ఉల్లిపాయ‌ల ధ‌ర‌ల కార‌ణంగా ప‌డిపోయింది. పంజాబ్‌లో ధాన్యం కొనుగోళ్ల‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌తోనూ ప్ర‌భుత్వం ప‌డిపోయిన సంద‌ర్భం తెలిసిందే. ఇక‌, ఇప్ప‌డు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో 'యాపిల్‌' త‌న స‌త్తాచాటుతోంది.

దీనికి కార‌ణం.. యాపిల్ రైతుల నిర‌స‌న‌లు ఠారెత్తుతుండ‌డ‌మే. ముఖ్యంగా ఇక్క‌డ అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి యాపిల్ పండ్ల రైతుల నుంచి మ‌రింత రాజ‌కీయ సెగ పెరిగింది. ఈ యాపిల్ పండ్ల వల్ల గతంలో ప్రభుత్వాలు మారిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఇదే విషయం మ‌రోసారి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కమలాన్ని కలవరపెడుతోంది.

యాపిల్‌ పంటకు పెట్టింది పేరైన హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఈ పండ్ల వ్యాపారం ఎన్నికలను ప్రభావితం చేస్తోంది. యాపిల్‌ వ్యాపారంలోని కష్టనష్టాలు ఈసారి ఎన్నికల్లో అధికార బీజేపీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేష‌కులు చెబుతున్నారు.

భారత్‌లో యాపిల్‌ పంటకు స్వర్గధామంలా భావించే హిమాచల్‌లో ఏటా 5వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థికంలో ఈ రంగం వాటా 13.5%. 68 సీట్ల అసెంబ్లీలో 20 నుంచి 25 సీట్లను యాపిల్‌ వ్యాపారం ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

1990లో శాంతకుమార్‌ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించిన ఘనత యాపిల్‌ వ్యాపారుల ఆందోళనదే అంటే న‌మ్మ‌లేం. కానీ, ఇది నిజం. కనీస మద్దతు ధర కావాలంటూ ఆనాడు నినదించిన యాపిల్‌ వ్యాపారులపై బీజేపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంజేసింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణించారు. ఫలితంగా.. తర్వాత జరిగిన ఎన్నికల్లో 60 సీట్లు కాంగ్రెస్‌ ఖాతాలో పడిపోయాయి.

అధికారంలోకి రాగానే ఆనాటి ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ యాపిల్‌ రైతుల డిమాండ్లకు పచ్చజెండా ఊపారు. మళ్లీ అప్పటి నుంచి ఈ వర్గం పెద్దగా ఆందోళనలు చేసింది లేదు. 30 ఏళ్ల తర్వాత ఈసారి మళ్లీ యాపిల్‌ రైతులు, వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. పెరిగిన జీఎస్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వ మద్దతును కోరుతూ రైతులు రోడ్లమీదికి వస్తున్నారు.

పంటకు వాడే పురుగుమందులు, ప్యాకేజీ అట్టపెట్టలపై జీఎస్టీని 18శాతానికి పెంచారు. గతంలో వీటిపై పన్ను ఉండేది కాదు. అసలే సాగువ్యయం పెరిగి ఇబ్బంది పడుతుంటే ఈ పన్నుతో తమకేమీ గిట్టుబాటు కావటం లేదన్నది రైతుల ఆందోళన. పెద్దపెద్ద కంపెనీలు రంగంలోకి దిగి మార్కెటింగ్‌పై గుత్తాధిపత్యం చెలాయిస్తుండటం, వాటికి రాజకీయ పార్టీలు దన్నుగా నిలుస్తుండటం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది.

వీటికితోడు ఎంఐఎస్‌ పథకం కింద ప్రభుత్వం నుంచి సొమ్ము చెల్లింపులు కూడా ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముంగిట త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలని రైతులు కోరుతున్నారు. అయితే, దీనిని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొన‌లేదు. దీంతో ప్ర‌భుత్వం నిలుస్తుందా? కూలుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.