Begin typing your search above and press return to search.

పండుగ చేసుకుందామా? హైదరాబాద్ లో లీటరు డీజిల్ రూ.100

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:24 AM GMT
పండుగ చేసుకుందామా? హైదరాబాద్ లో లీటరు డీజిల్ రూ.100
X
ఎవరేం అన్నా ఫర్లేదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించే ప్రభుత్వాల్ని ఇటీవల కాలంలో చూస్తున్నాం. ప్రజల సెంటిమెంట్లు దెబ్బ తింటున్నా.. ఆందోళనలు.. నిరసన ప్రదర్శనలు ఎంతలా పెరుగుతున్నా.. తాము అనుకున్న పాలసీని పాటించటం.. ప్రజలేం అయిపోయినా ఫర్లేదన్నట్లుగా ప్రదర్శించటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి వాటికి మాస్టర్ మైండ్ గా మోడీ సర్కారును చెప్పాలి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధర అంత భారీగా లేనప్పటికీ పెట్రోల్.. డీజిల్ ధరల్ని అంతకంతకూ పెంచేస్తున్న వైనం దేశీయంగా సామాన్య.. మధ్యతరగతి ప్రజలకు షాకింగ్ గా మారింది. నిత్యవసర వస్తువుగా మారిన డీజిల్.. పెట్రోల్ ధరలు పెరిగితే.. ఎన్నో రకాలుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భారం పడటం ఖాయం. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా.. తమకు తోచిన విధానాన్ని అమలు చేస్తున్న కేంద్రం తీరుతో తాజాగా హైదరాబాద్ మహానగరం మరో రికార్డును క్రియేట్ చేసింది.

ఇంతకాలం లీటరు డీజిల్ వంద రూపాయిలకు దిగువున ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అది కాస్తా మారింది. కొద్దికాలం క్రితమే లీటరు పెట్రోల్ ను వందకు తీసుకెళ్లిపోగా.. ప్రస్తుతం రూ.110 దిశగా పరుగులు తీస్తోంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.107.40కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా డీజిల్ ధరల్ని పెంచటంతో లీటర డీజిల్ వంద మార్కును దాటేసింది. నిజానికి లీటరు డీజిల్ ధర వంద మార్కును ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దాటేసింది. తాజాగా హైదరాబాదీయులకు ఆ కొరత కాస్తా తీరిపోయిందనే చెప్పాలి. ఏది ఏమైనా.. దసరా పండక్కి మోడీసాబ్ భలే గిప్టు ఇచ్చారుగా? కేంద్రం పన్నుల పోటు ఎక్కువగా ఉన్న వేళ.. ప్రజలకు దన్నుగా నిలవటానికి వీలుగా రాష్ట్రాలు తమ పన్ను ఆదాయాన్ని కాస్త తగ్గించుకుంటూ.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని కాస్త తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. కానీ.. ఇప్పటి పాలకులు ఇలాంటి వినతుల్ని సీరియస్ గా తీసుకుంటారా చెప్పండి?