Begin typing your search above and press return to search.

ఎన్‌ పీఏల‌పై ఎస్బీఐ చీఫ్ కామెంట్ విన్నారా?

By:  Tupaki Desk   |   12 July 2017 6:44 AM GMT
ఎన్‌ పీఏల‌పై ఎస్బీఐ చీఫ్ కామెంట్ విన్నారా?
X
బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు ఎగ‌వేస్తున్న రుణాల కార‌ణంగా బ్యాంకుల‌పై పెను భారంగా మారుతున్న నిర‌ర్థ‌క ఆస్తులు (ఎన్‌ పీఏ)ల‌పై ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం అరుంధ‌తీ భ‌ట్టాచార్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎస్బీఐతో పాటు మ‌రికొన్ని బ్యాంకులకు క‌ట్టాల్సిన రూ.9 వేల కోట్ల‌ను ఎగ‌వేపి... ఎంచ‌క్కా ఫ్లైట్ ఎక్కేసి లండ‌న్‌ లో దిగిపోయి... జ‌ల్సాగా తిరుగుతున్న లిక్క‌ర్ విజ‌య్ మాల్యా ఉదంత‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న ద‌రిమిలా భ‌ట్టాచార్య చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాకుండా సంచ‌ల‌నంగా కూడా మారాయి. ఓ వైపు మాల్యాను దేశానికి తిరిగి ర‌ప్పించేందుకు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తుండ‌గా, అస‌లు ఎన్‌ పీఏల‌ను నేరంగా ఎలా ప‌రిగ‌ణిస్తార‌ని భ‌ట్టాచార్య ప్ర‌శ్నించ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సామాన్యుల‌కు వేల‌ల్లో ఇచ్చే రుణాల‌ను ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేసే బ్యాంకులు... బ‌డా బాబుల‌కు ఇచ్చే వేల కోట్ల రుణాల‌కు మాత్రం స‌రైన ష్యూరిటీలు కూడా చూసుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఎగ‌వేత‌దారుల‌పై దివాలా చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేసి శిక్షించాల‌ని రిజ‌ర్వ్ బ్యాంకు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో భ‌ట్టాచార్య ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఎగ‌వేత‌దారుల‌కు వెన్నుద‌న్నుగా నిలిచేలానే ఆమె వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఎగ‌వేత‌దారులు ఎగ‌వేసిన రుణాలు ఇప్ప‌టికే రూ.8 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న కోల్‌ క‌తాలో జ‌రిగిన ఫిక్కీ స‌ద‌స్సుకు హాజ‌రైన సంద‌ర్భంగా భ‌ట్టాచార్య... నిజంగానే సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

బ్యాంకులకు భారంగా ప‌రిణ‌మిస్తున్న ఎన్‌ పీఏల‌ను నేరంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌సరం లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు. మ‌న దేశంలో మొండి బ‌కాయిల‌ను నేరంగా ప‌రిగ‌ణిస్తున్నార‌ని, అలా ప‌రిగ‌ణించకూడ‌ద‌ని ఆమె అన్నారు. ఎన్‌పీఏలు త‌యార‌య్యేది వైఫ‌ల్యాల వ‌ల్లేన‌ని, వైఫ‌ల్యాల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని ఆమె కొత్త అర్థం చెప్పారు. దేశంలో జీడీపీ బాగా వృద్ధి చెందుతున్న త‌రుణంలో ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మార‌తాయ‌ని ఊహించ‌లేద‌ని ఆమె చెప్పుకొచ్చారు. జీడీపీ 8.5 శాతం నుంచి ఏక‌బిగిన 4 శాతానికి ప‌డిపోవ‌డంతోనే ఎన్‌ పీలే భారీగా పెరిగిపోయాయని తెలిపారు. మ‌రి బ‌డా బాబులు ఎగ‌వేస్తున్న రుణాల‌ను ఏ విధంగా వ‌సూలు చేయాల‌న్న విష‌యాన్ని మాత్రం ఆమె పేర్కొన‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయినా అందిన‌కాడికి దోచుకుని, న‌కిలీ ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టేసి ఉడాయిస్తున్న బ‌డా బాబుల భ‌రతం ప‌ట్టేందుకు ఆర్బీఐ ఆదేశాల‌ను అస్త్రంగా మ‌ల‌చుకుని ముందుకు సాగాల్సిన భ‌ట్టాచార్య‌... అస‌లు ఎన్‌పీఏల‌నే నేరంగా ప‌రిగ‌ణించ‌కూడ‌ద‌ని చెప్ప‌డం నిజంగా షాకింగేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.