Begin typing your search above and press return to search.

జాతీయ జట్లక్కడ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో.. ఆటగాళ్లేమో ఐపీఎల్ లో..

By:  Tupaki Desk   |   1 April 2022 11:30 AM GMT
జాతీయ జట్లక్కడ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో.. ఆటగాళ్లేమో ఐపీఎల్ లో..
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ చరిత్రనే కాదు.. ప్రపంచ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆటగాళ్లు దేశం కంటే ఐపీఎల్ కే ప్రాధాన్యమిచ్చేలా చేసింది. ఓ దశలో దేశమా...? లీగా? తేల్చుకోమంటూ ఆయా క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను హెచ్చరించే వరకు వెళ్లింది.

లీగ్ మొదలైన మూడు, నాలుగేళ్లు ఇలా ఒకటే గోల. లసిత్ మలింగ మొదలు షకిబుల్ హసన్ వరకు ఇలా ఎందరో..? కొందరు క్రికెటర్లు ఐపీఎల్ వంటి లీగ్ ల కోసమే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఉదంతాలున్నాయి. సరే, ఇప్పుడు ఇలాంటి రచ్చ పెద్దగా లేదు. చాలా బోర్డులు ఐపీఎల్ ఇతర లీగ్ ల షెడ్యూల్ కు తగ్గట్లు తమ సిరీస్ లను మార్చుకున్నాయి. అయినా, కొన్నిసార్లు క్లాష్ వస్తోంది. ప్రస్తుతం అదే జరుగుతోంది.

విలియమ్సన్ సన్ రైజర్స్ కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. కళాత్మక విధ్వంసం అంటే ఏమిటో అతడి బ్యాటింగ్ చూస్తే తెలిసిపోతుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూల్ గా ఆడే విలియమ్సన్ న్యూజిలాండ్ కు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్. అయితే, ప్రస్తుతం సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు కెప్టెన్ కూడా. వాస్తవానికి సన్ రైజర్స్ జట్టులో విలియమన్స్ ఒక్కడే నాణ్యమైన ఆటగాడు.

ఆ విషయం పక్కనపెడితే.. న్యూజిలాండ్ తమ స్వదేశంలో నెదర్లాండ్స్ తో సిరీస్ లో తలపడుతోంది. కానీ, ఆ సిరీస్ కు విలియమ్సన్ దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఆడుతున్నాడు. నెదర్లాండ్స్ ఇంకా ఓనమాలు దశలోనే ఉంది కాబట్టి విలియమ్సన్ లేకున్నా పెద్దగా ఫర్వాలేదు. అయితే, ఇక్కడ విషయం.. కెప్టెన్ స్థాయి ఆటగాడు జాతీయ జట్టును వదిలేసి లీగ్ కు ఆడుతుండడం గమనించదగ్గ విషయం.

దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్ తో.. రబడ పంజాబ్ కు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ మంచి బౌలర్. పిచ్ అనుకూలిస్తే పదునైన అతడి బంతులను ఎదుర్కొనడం చాలా కష్టం. రబడ లాంటి అథ్లెటిక్ బౌలర్ తమ జట్టులో ఉండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడు. కానీ, రబడ ప్రస్తుతం దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఆడడం లేదు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున శుక్రవారం నాటి మ్యాచ్ లో బరిలో దిగబో్తున్నాడు. వాస్తవానికి ఈ సారి ఐపీఎల్ లీగ్ కు ముందు దక్షిణాఫ్రికా బోర్డుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది.

కాగా, దక్షిణాఫ్రికాకే చెందిన ప్రతిభావంతుడైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టెస్టుల నుంచి తప్పుకొని ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు ఈసారి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. జాతీయ జట్టు పునర్మిర్మాణ దశలో ఉన్నప్పుడు టెస్టులకు గుడ్ బై చెప్పడం గమనార్హం. లీగ్ క్రికెట్ కోసమే డికాక్ ఇలా చేశాడనే భావన కలుగుతోంది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ కూడా అంతే. రెండేళ్ల కిందట టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. లీగ్ క్రికెట్ ను ప్రాధామ్యంగా తీసుకున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్కింగ్స్ కు ఆడుతున్నాడు. న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే, విండీస్ ఆల్ రౌండర్ బ్రేవో.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎందరో?