Begin typing your search above and press return to search.

ఇంట్ర‌స్టింగ్ః ఆ దేశ అధ్య‌క్ష భ‌వ‌నానికి.. ప‌క్షులే సెక్యూరిటీ!

By:  Tupaki Desk   |   18 July 2021 2:30 AM GMT
ఇంట్ర‌స్టింగ్ః  ఆ దేశ అధ్య‌క్ష భ‌వ‌నానికి.. ప‌క్షులే సెక్యూరిటీ!
X
ఒక దేశానికి అధ్య‌క్షుడు అంటే సాధార‌ణ విష‌యం కాదు. ఆ ప‌ద‌విలో ఉన్నంత వ‌ర‌కు దేశానికి ప్ర‌థ‌మ పౌరుడు. అంతేకాదు.. ఆ దేశాన్ని ముందుకు న‌డిపించే నాయ‌కుడు. అలాంటి నేత ప్రాణాల‌కు అబేధ్య‌మైన ర‌క్ష‌ణ ఉంటుంది. శ‌త్రువులు ఛేదించ‌డానికి వీళ్లేని విధంగా భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ ఉంటుంది. బ‌య‌ట‌కు వెళ్తే జ‌డ్ ప్ల‌స్ సెక్యూరిటీ ప‌హారా కాస్తుంది. ఇక‌, అధ్య‌క్షుడు నివాసం ఉండే ప్రాంతానికి ఇంకా ఎలాంటి భ‌ద్ర‌త ఉంటుందో ఊహించొచ్చు.

సాయుధులైన పోలీసుల‌తోపాటు.. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇచ్చిన బ‌ల‌గాలు ప‌హారా కాస్తుంటాయి. అంతేకాదు.. ఆ ప్రాంతాని నో ఫ్లై జోన్ గా ప్ర‌క‌టిస్తారు. అంటే.. ఆ ప్రాంతం మీదుగా విమానాలుగానీ, హెలీ కాఫ్ట‌ర్లుగా, ఏ ఇత‌ర ఎగిరే వ‌స్తువులు కూడా నిషిద్ధం. ఇది అన్ని దేశాల్లోనూ ఉంటుంది. అయితే.. ర‌ష్యాలో మాత్రం అధ్య‌క్ష భ‌వ‌నం వ‌ద్ద ప‌క్షులు కాప‌లా కాస్తుంటాయి! అవును.. ఇది నిజ‌మే. గుడ్ల గూబ‌, గ‌ద్ద నిత్యం ప‌హారా కాస్తుంటాయి.

ఇప్ప‌టి నుంచి కాదు.. 1984 సంవ‌త్స‌రం నుంచి అక్క‌డ ఈ రెండు ప‌క్షుల‌తో గ‌స్తీ కాయిస్తున్నారు! అయితే.. ఇదంతా శ‌త్రువుల నుంచి ర‌క్ష‌ణ కోసం కాదు. ఇత‌ర ప‌క్షులు అక్క‌డికి రాకుండా. అవును.. ర‌ష్యా ప్రెసిడెన్షియ‌ల్ ప్యాలెస్ ప‌రిధిలో ప‌లు భ‌వ‌నాలు ఉన్నాయి. గ‌తంలో వీటిమీద‌కు ప‌క్షులు వ‌చ్చి రెట్ట‌లు వేయ‌డం.. చెత్తా చెదారం వేయ‌డం వంటివి చేస్తూ అప‌రిశుభ్రంగా మార్చేవి.

ఈ ప‌రిస్థితిని మార్చేందుకు గ‌ద్ద‌లు, గుడ్ల గూబ‌ల‌ను కాప‌లా ఉంచ‌డం మొద‌లు పెట్టారు. వీటికి తాళ్లూ, గొలుసులు క‌ట్టి ఉంచుతార‌ని అనుకుంటున్నారేమో..? అదేమీకాదు. వీటికి కుక్క‌ల మాదిరిగా స్పెష‌ల్ ట్రైనింగ్ ఇస్తారు. ప‌ర్ఫెక్ట్ ట్రైన్డ్ అనుకున్న త‌ర్వాత డ్యూటీలోకి దింపుతారు. వీటి ప‌ని ఏమంటే.. అటువైపు ఇత‌ర ప‌క్షులు ఏవీ రాకుండా చూడ‌డం. ఏవైనా రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. వెంట‌నే దాడికి సిద్ధ‌మ‌వుతాయి. దొర‌క్కుండా పారిపోతే ఓకే. లేదంటే.. ర‌క్కి, పొడిచి చంపేస్తాయి. అద‌న్న‌మాట వీటి సెక్యూరిటీ సంగ‌తి.