Begin typing your search above and press return to search.

'ఉదయం బాబును దేవుడంటారు.. సాయంత్రానికి వెధవని తిడతారు'

By:  Tupaki Desk   |   16 Sept 2022 1:30 AM
ఉదయం బాబును దేవుడంటారు.. సాయంత్రానికి వెధవని తిడతారు
X
నిజమే.. టీడీపీ అధినేత చంద్రబాబు జాతకం ఏమో కానీ.. ఆయన కష్టపడి పైకి తెచ్చిన వారంతా.. తర్వాతి కాలంలో తిట్టి పోస్తుంటారు. ఎవరికైతే లైఫ్ ఇచ్చారో వారిలో చాలామంది ఆయన్ను ఏదో విధంగా మాటలు అన్నోళ్లే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు దేవినేని అవినాష్. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. లండన్ యూనివర్శిటీ ఆఫ్ బిజినెస్ మేనేజిమెంటు నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అవినాష్.. మిగిలిన రాజకీయ నేతలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు.

తాను ప్రాతినిధ్యం వహించే పార్టీకి పెద్ద ఎత్తున అండగా నిలిచినట్లుగా మాట్లాడే అవినాష్ గతాన్ని చూస్తే.. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కొడాలి నాని మీద పోటీ చేసి ఓటమిపాలు కావటం తెలిసిందే.

ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిపోయిన ఆయన.. చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసు లేని దేవినేని అవినాష్.. టీడీపీ అధినేతను ఉద్దేశించి విమర్శలు చేసే విషయంలోఅస్సలు తగ్గని అతను.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును వైసీపీ నేతల కంటే కూడా టీడీపీ నేతలే ఎక్కువగా తిడతారన్నారు. ఆయన్ను ఉదయం దేవుడిగా కీర్తించే తెలుగు తమ్ముళ్లు సాయంత్రం అయ్యేసరికి ఆయనకు మించిన వెధవ మరొకరు ఉండరంటూ వ్యాఖ్యలు చేస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కాబట్టి ఏం చేయలేక కవ్వింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.

సీఎం జగన్ ను ఆయన కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన ఆయన.. విజయవాడలో టీడీపీ భూస్థాపితం అయినట్లేనని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమాకు మైలవరంలోనే దిక్కు లేదని.. అలాంటిది జిల్లాలో టీడీపీని ఆయనేం గెలిపిస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి క్రిష్ణా జిల్లా మొత్తం వైసీపీ ఘన విజయాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేసిన అవినాష్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షించేలా మారాయి. దేవినేని అవినాశ్ చెప్పినట్లు తెలుగు తమ్ముళ్లు బాబును ఉదయం అలా.. రాత్రిళ్లు ఇలా తిట్టటం సరైనదేనా? అన్న సందేహాన్ని తన తాజా వ్యాఖ్యలతో మిగిల్చారని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.