Begin typing your search above and press return to search.

రాజ‌కీయ న‌దిలో.. చెరోవైపు

By:  Tupaki Desk   |   11 July 2021 8:41 AM GMT
రాజ‌కీయ న‌దిలో.. చెరోవైపు
X
రాజ‌కీయాలు మ‌హా విచిత్ర‌మైన‌వి.. స‌మీక‌ర‌ణాలు ఎప్ప‌డు ఏ ర‌కంగా మార‌తాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక్క‌సారి రాజ‌కీయాల్లో అడుగుపెట్టారంటే ఎలాంటి స‌వాళ్లు ఎదురైనా తాము న‌మ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంపైనే దృష్టి పెట్టాలి. కానీ కొన్నిసార్లు వివిధ ప‌రిస్థితుల ప్ర‌భావం కార‌ణంగా త‌మ మార్గాన్ని మార్చుకుంటూ సాగాల్సి ఉంటుంది. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విష‌యంలో ప‌ర‌స్ప‌ర విరుద్ధ అంశాలు క‌నిపిస్తున్నాయి. ష‌ర్మిల ఏమో ఎలాంటి అండాదండా లేని తెలంగాణ‌లో పార్టీ పెట్టి మ‌హామ‌హుల‌తో త‌ల‌ప‌డేందుకు మొండి ప‌ట్టుద‌ల ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా. . మ‌రోవైపు ప్ర‌శ్నించ‌డానికి పార్టీ పెట్టిన ప‌వ‌న్‌.. వివిధ కార‌ణాల‌తో వేర్వేరు పార్టీల‌తో క‌లిసి త‌న సిద్దాంతాన్ని ప‌క్క‌న‌పెట్టాడ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డిన వైఎస్సార్ కూతురిగా తెలంగాణ‌లో త‌న‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ పోరాట‌న్నే న‌మ్ముకున్న ష‌ర్మిల కొత్త పార్టీ పెట్టి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌కీయాలు ఆమెకు కొత్తేమీ కాదు. గ‌తంలో త‌న అన్న జ‌గ‌న్ జైళ్లో ఉన్న‌పుడు ఏపీలో పాద‌యాత్ర చేసిన వైఎస్సార్ సీపీ ఉనికిని కాపాడిన ఆమె.. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ప‌దునైన ప్ర‌సంగాల‌తో ఆక‌ట్టుకున్నారు. అధికారంలో ఉన్న త‌న అన్న‌కు ఎదురు వెళ్ల‌డం ఇష్టం లేక ఇప్ప‌డు తెలంగాణ‌లో రాజ‌న్య రాజ్యం కోసం పార్టీ పెట్టారు. నిధులు, నీళ్లు, నియామ‌కాల నినాదంతో ఏర్ప‌డిన తెలంగాణ‌లో ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లు కేసీఆర్ పాల‌న లేదంటూ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని, అప్పులు మాత్ర‌మే మిగులుతున్నాయ‌ని అధికార ప్ర‌భుత్వంపై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. చ‌ట్ట‌ప్ర‌కారం తెలంగాణ‌కు ద‌క్కాల్సిన ఒక్క నీటి బొట్టునూ వ‌దులుకోమ‌ని స్ప‌ష్టం చేశారు. నిరోద్య‌గ యువ‌త‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ దీక్ష చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. రాజ‌కీయాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న వాళ్లెవ‌రైనా పార్టీ పెట్టిన త‌ర్వాత ఇలాగే చేస్తారు.

2014లో జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఇత‌ర పార్టీ ప్ర‌యోజ‌నాల కోసమే త‌న సిద్ధాంతాన్ని ప‌క్క‌న‌పెట్టార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌కుండా అప్ప‌టి టీడీపీ- బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు తెలిపారు. ఇటు ఏపీలో టీడీపీ, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాయి. ఆ త‌ర్వాత నాలుగేళ్ల పాటు పెద్ద‌గా హ‌డావిడి చేయ‌ని ఆయ‌న‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు. వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి 2019 ఎన్నిక‌ల్లో పోటీచేశారు. కానీ ఆయ‌న పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోగా.. ఆ పార్టీ నుంచి కేవ‌లం ఒక్క అభ్య‌ర్థి మాత్ర‌మే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడేమో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తిరిగి పొత్తు పెట్టుకున్నారు. ఒక‌ప్పుడు మోదీ స‌ర్కారుపై బ‌హిరంగ స‌భ‌ల్లో తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న‌.. ఇప్పుడ‌దే పార్టీతో క‌ల‌వ‌డం ఆయ‌న రాజ‌కీయ గంద‌ర‌గోళ అవ‌గాహ‌న‌ను చాటుతోంద‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి.

ఇప్పుడేమో తిరిగి సినిమాల‌తో బిజీ అయిన ప‌వ‌న్‌.. పార్టీపై ఎలా ముందుకు తీసుకెళ్తారో తెలీని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న స‌న్నిహితులే అంటున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో పార్టీ నిర్మాణం క‌ష్ట‌మ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. మొత్తంగా జ‌న‌సేన‌ను మ‌రో పార్టీలో విలీనం చేసే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని బ‌య‌ట చెప్పుకుంటున్నారు. ప్ర‌సంగాల్లో మాట‌ల‌తో హోరోత్తించే ప‌వ‌న్‌.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకుని పార్టీవైపు ప్ర‌జ‌లు మొగ్గుచూపే అవ‌కాశం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఓ వైపు ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ష‌ర్మిల నిల‌బ‌డితే.. మ‌రోవైపు అనుకూల ప‌రిస్థితుల్లోనూ ప‌వ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నారు. తెలంగాణ‌లో ష‌ర్మిల అధికారంలోకి వస్తారా? లేదా? అనేది భ‌విష్య‌త్ నిర్ణ‌యిస్తుంది. కానీ ఇప్ప‌డు ఆమె అనుస‌రిస్తున్న పోరాట‌, రాజ‌కీయ మార్గాన్ని ప‌వ‌న్ స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో బ‌ల‌ప‌డేందుకు కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసుకుంటే మేల‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.