Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ దేశాల‌కు చిప్‌లు కావాలంటే ఆ దేశం సుర‌క్షితంగా ఉండాల్సిందేనా!

By:  Tupaki Desk   |   12 Oct 2022 10:40 AM GMT
ప్ర‌పంచ దేశాల‌కు చిప్‌లు కావాలంటే ఆ దేశం సుర‌క్షితంగా ఉండాల్సిందేనా!
X
వివిధ ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, సెల్‌ఫోన్లు, విమానాల తయారీ కంపెనీలు త‌దిత‌రాల‌కు సంబంధించిన చిప్స్‌, సెమీ కండ‌క్ట‌ర్‌ల‌ను భారీ ఎత్తున ప్ర‌పంచ దేశాల‌కు ఎగుమ‌తి చేస్తోంది.. తైవాన్‌. ప్ర‌పంచ దేశాల‌కు అవ‌స‌ర‌మైన మొత్తంలో 85 శాతం చిప్‌లు, సెమీకండ‌క్ట‌ర్లు ఒక్క తైవాన్ నుంచే ఎగుమ‌తి అవుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగ‌డంతో చైనాకు కూడా ఊపొచ్చింది. తైవాన్‌ను క‌బ‌ళించాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. అదేస‌మ‌యంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ త‌మ అనుమ‌తి లేకుండా తైవాన్‌ను సంద‌ర్శించ‌డంతో చైనా అగ్గిమీద గుగ్గిల‌మైంది. అమెరికా ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. తైవాన్ త‌మ దేశ అంత‌ర్భాగ‌మ‌ని.. అమెరికా చ‌ర్య త‌మ సార్వ‌భౌమాధికారంలో వేలు పెట్ట‌డ‌మేన‌ని మండిప‌డింది. తైవాన్ ను ఆక్ర‌మించుకోవ‌డానికి భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేప‌ట్టింది. చైనా యుద్ధ విమానాలు తైవాన్ గ‌గ‌న‌తలంలోకి ప్ర‌వేశించాయి.

ఈ నేప‌థ్యంలో తైవాన్ హాట్ కామెంట్స్ చేసింది. ప్ర‌పంచానికి చిప్‌లు, సెమీ కండ‌క్ట‌ర్లు కావాలంటే తైవాన్ సుర‌క్షితంగా ఉంటేనే అది సాధ్య‌మ‌వుతుంద‌ని తైవాన్ ఆర్థిక శాఖ మంత్రి వాంగ్ మెయి హువా తెలిపారు. తాజాగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న ఆమె ఈ మేర‌కు మీడియాతో మాట్లాడారు. చైనా ఏమాత్రం దుందుడుకు చ‌ర్య‌లకు దిగినా అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. సైనిక శక్తిని ఉప‌యోగించి చైనా తమ సెమీకండ‌క్టర్‌ సంస్థలను స్వాధీనం చేసుకోలేద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన చిప్స్‌ తయారీ కాంట్రాక్టర్‌ అయిన తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ (టీఎస్‌ఎంసీ)ని చైనా సైనిక శక్తితో స్వాధీనం చేసుకుంటే.. అది కార్యకలాపాలను నిలిపివేస్తుందని తైవాన్ ఆర్థిక శాఖ మంత్రి వాంగ్ మెయి హువా తెలిపారు. ఈ నేప‌థ్యంలో తైవాన్‌కు ఏం జ‌రిగినా దాని ప్ర‌తికూల ప్ర‌భావం ప్ర‌పంచ దేశాల‌పై ప‌డుతుంద‌ని గుర్తు చేశారు.

''తైవాన్ సుర‌క్షితంగా ఉంటేనే ప్రపంచ సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థ భ‌ద్రంగా ఉంటుంది. అమెరికా, దాని మిత్రదేశాలతో కలిసి అత్యంత సమ‌ర్థ‌వంతంగా చిప్స్‌ ఉత్పత్తి చేయడానికి తైవాన్‌ అత్యంత ఆసక్తిగా ఉంది'' అని తెలిపారు.

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా అమెరికా స్వ‌యంగా అమెరికాలో చిప్స్‌ తయారీ పరిశ్రమను ప్రోత్సహించడంపై తాము ఆందోళన చెందడంలేదని వాంగ్ వెల్ల‌డించారు. తైవాన్‌లో దాదాపు 40 ఏళ్లుగా సెమీకండెక్టర్ త‌యారీ పరిశ్రమ చాలా బలంగా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌న్నారు. తైవాన్‌ వంటి మరో చిప్స్‌, కండ‌క్ట‌ర్ల పంపిణీ వ్య‌వ‌స్థ‌ను సృష్టించ‌డం, భర్తీ చేయడం చాలా కష్టమని వివ‌రించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.