Begin typing your search above and press return to search.

ఎంత కామెడీ చేసినా.. ఈ విషయంలో కేఏ పాల్ ఏపీ నేతల కంటే బెటర్.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   3 Jan 2023 5:28 AM GMT
ఎంత కామెడీ చేసినా..  ఈ విషయంలో కేఏ పాల్ ఏపీ నేతల కంటే బెటర్.. ఎందుకంటే?
X
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు శవ రాజకీయాలు నడుస్తున్నాయి. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానిపై అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు అరెస్టుల నుంచి బస్సుల తగలబెట్టే వరకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో అసలు ప్రజా సమస్యలు పక్కదారికి వెళ్తున్నాయి. సంయమనం పాటించాల్సిన అధికార ప్రభుత్వం ఇష్యూను మరింత రేజ్ చేస్తోంది. తప్పు ఒప్పుకోవాల్సిన ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాన్ని ఏ ప్రజలు ఒప్పుకోరు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని బాగా గమనించిన తెలంగాణలోని బీఆర్ఎస్ ఇప్పుడు ఆంధ్రలో అడుగుపెట్టింది. ఆంధ్రాలో ఇప్పుడున్న రెండు పార్టీలను కాదని చాలా మంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మరోవైపు వీరందరి కంటే కేఏ పాల్ నయం అన్న చర్చకు దారి తీస్తోంది.. ఎందుకంటే..?

సంక్రాంతి కానుకల సందర్భంగా ఇటీవల తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించారు. అంతకుముందు నెల్లూరు రోడ్ షో లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదాలు అనుకోకుండా జరిగావో.. ఇంకేదో తెలియదు గానీ.. ఈ సందర్భాన్ని మాత్రం అధికార, ప్రతిపక్ష రాజకీయాలు వాడుకుంటున్నాయి. వైసీపీ నాయకులు చంద్రబాబు ఓట్ల కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపిస్తుండగా.. కావాలని ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారని టీడీపీ నాయకులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. అంతేగానీ తమది పొరపాటు అయిందని టీడీపీ ఒప్పుకోవడం లేదు. మరోసారి పునరావృతం చేయొద్దని అధికార పార్టీ హెచ్చరించడం లేదు. మొత్తంగా ప్రజోపయోగమైన వ్యాఖ్యలు ఎవరూ చేయడం లేదు. కానీ రాజకీయం మాత్రం చేస్తున్నారు.

ఇదే కోణంలో కాపుల రిజర్వేషన్ల పరిస్థితి అలాగే ఉంది. కాపు రిజర్వేషన్లు కల్పించాలని కాపు సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నిరాహర దీక్షకు దిగేందుకు యత్నించారు. ఎన్నో ఏళ్లుగా కాపు రిజర్వేషన్లు పట్టించుకోవడం లేదని ఆ సేన నాయకులు విమర్శిస్తున్నారు. అయితే కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ పాలనలో అసెంబ్లీలో తీర్మానం చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కాపు రిజర్వేషన్ల కోసం చర్యలు తీసుకుంటుందా..? అంటే స్పందన లేదు. కానీ టీడీపీ, వైసీపీల్లోని కాపు నేతలతో ఆరోపణలు మాత్రం చేయిస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై అనవసర కామెంట్లు చేయిస్తున్నారు.

ఈ తరుణంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అసలు సమస్యను పక్కనబెట్టి ఆరోపణ, ప్రత్యారోపణలతోనే కాలం గడుపుతున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని ఉంది గనుకే బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆంధ్రాలో ఎంట్రీ ఇస్తున్నాయని అంటున్నారు. భవిష్యత్ లో ఈ రెండు పార్టీలు నచ్చని వారు బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి పెద్దగా ఆలోచించరని అంటున్నారు.

అయితే వీరిందరి కంటే కేఏ పాల్ నయం అని కొందరు అంటున్నారు. కేఏ పాల్ అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో చెబుతున్నాడు. కానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో పాల్ గొప్ప అనుకునే అవకాశం లేదు. కానీ ప్రజా సమస్యలను రేజ్ చేయడంలో పాల్ ముందున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాల్ మాటల్లో ఎక్కడా బూతులు, తిట్లు కనిపించవు. కానీ సమస్యలపై మాట్లాడుతారు. కానీ ఆయన వాయిస్ ను కామెడీగానే తీసుకుంటున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ప్రజా సమస్యల గురించి పోరాడాలని ప్రజలు అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.