Begin typing your search above and press return to search.

తిరుపతిలో... రాజకీయ హడావుడి మొదలైపోయింది

By:  Tupaki Desk   |   24 March 2021 6:30 AM GMT
తిరుపతిలో... రాజకీయ హడావుడి మొదలైపోయింది
X
ఒక్కసారిగా తిరుపతిలో పార్టీల హడావుడి పెరిగిపోయింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ రావటంతో అభ్యర్ధులు నామినేషన్ల దాఖలకు రెడీ అవుతున్నారు. దాంతోపాటు అన్నీ పార్టీల అగ్రనేతలు తిరుపతిలోనే క్యాంపు వేయటంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మి బుధవారం నామినేషన్ వేస్తారని పార్టీ నేతలు చెప్పారు.

మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు కీలక నేతలంతా తిరుపతికి చేరుకున్నారు. బుధవారం వీళ్ళంతా అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తితో కలిసి భేటీ అవుతున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో ఇన్చార్జి మంత్రులు, 14 మంది ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు కీలక నేతలంతా హాజరవ్వాలని పార్టీ ఆదేశించింది.

అలాగే తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నేతలు సోమిరెడ్డి, మాజీమంత్రి అమరనాద్ రెడ్డి అండ్ కో భేటీ అవుతున్నారు. టీడీపీ సీనియర్ నేతలు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతున్నారు. కొన్ని చోట్ల పార్టీ స్ధానిక నేతల మధ్య గొడవలు బయటపడుతుండగా వాటిని సీనియర్లు తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నారు. పనబాక నామినేషన్ కార్యక్రమానికి నేతలంతా హాజరవ్వాలని ఇప్పటికే ట్రస్టుభవన్ ఆదేశించింది.

ఇక బీజేపీ నేతలు కూడా తిరుపతిలోనే క్యాంపువేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆధ్వర్యంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది సీనియర్లు వాకాటి నారాయణరెడ్డి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి లాంటివాళ్ళు కొద్దిరోజులుగా తిరుపతిలోనే క్యాంపేశారు. వీళ్ళకు పురందేశ్వరి, సత్యకుమార్ కలిశారు. కమలనాదులు ఎంతమంది క్యాంపేసినా ఉపయోగం కనబడటంలేదు. ఎందుకంటే ఇంతవరకు అభ్యర్ధే ఫైనల్ కాలేదు. ఇంతవరకు అభ్యర్ధిని ఫైనల్ చేయకపోవటంపై నేతలంతా ఢిల్లీ నాయకత్వంపై మండిపోతున్నారు.