Begin typing your search above and press return to search.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ఏ జిల్లాలో ఎంత?

By:  Tupaki Desk   |   15 March 2021 3:41 AM GMT
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ఏ జిల్లాలో ఎంత?
X
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భిన్నంగా.. భారీగా పోలింగ్ నమోదుకావటం గమనార్హం. అన్ని రాజకీయ పార్టీలు ముందస్తుగా పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేయటం.. అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు స్థానాల్లో విజయం సాధించాలన్న కసి కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావటానికి కారణంగా చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే.. తాజా ఎన్నికల పోలింగ్ కొత్త రికార్డులకు తెర తీసిందని చెప్పాలి. గతంతో పోలిస్తే.. ఓటర్ల సంఖ్య భారీగా పెరిగటమే కాదు.. పోలింగ్ కూడా భారీగా నమోదు కావటం విశేషం. ఇక.. రెండు స్థానాలకు జరిగిన ఎన్నికలు.. తెలంగాణలోని ఆరు పాత జిల్లాల పరిధిలో జరిగాయి. కొత్త జిల్లాలను లెక్కలోకి తీసుకుంటే.. 22 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించారు. మరి.. ఎక్కడ ఎంత పోలింగ్ జరిగింది? అన్నది చూస్తే..పలుఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీస్థానంతో పోలిస్తే.. వరంగ్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికే ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక్కడ మూడు జిల్లాల్లో 80 శాతానికి పైనే పోలింగ్ నమోదు కావటం విశేషం. అత్యధికంగాఅత్య జనగాం జిల్లాలో 83.37 శాతం నమోదైతే.. సిద్ధిపేటలో 82.28 శాతం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 81.17 శాతం పోలింగ్ నమోదైంది.అత్యల్పంగా పోలింగ్ జరిగిన జిల్లాగా జయశంకర్ భూపాలపల్లిని చెప్పాలి. ఇక్కడ.. 69.44 శాతమే పోలింగ్ జరిగింది. తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ నిలిచింది. ఈ జిల్లాలో 72.98 శాతంగా నమోదైంది.

ఇక.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల మొత్తం పోలింగ్ 64.87 శాతంగా నమోదైంది. గతంతో పోలిస్తే.. రెట్టింపునకు పైనే పోలింగ్ నమోదు కావటం గమనార్హం. ఈ ఎన్నికలో పది కొత్త జిల్లాల పరిధిలో జరిగింది. అత్యధిక పోలింగ్ గద్వాలలోనమోదైంది. ఇక్కడ ఏకంగా 75.95 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాతి స్థానంలో వికారాబాద్ నిలిచింది. ఇక్కడ 75 శాతం నమోదైంది. తర్వాతి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరిగా నిలిచింది. ఈ జిల్లాలో ఏకంగా 70.99 వాతం పోలింగ్ నమోదైంది.

అత్యల్ప పోలింగ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ 52.76 శాతం పోలింగ్ నమోదైంది. కాకుంటే.. అధిక ఓట్లు ఉన్న మూడు జిల్లాల్లో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఓట్లు వేసే విషయంలో మాత్రం చివరి స్థానంలో నిలిచింది. కాకుంటే.. గత ఎన్నికతో పోలిస్తే.. ఇది చాలా ఎక్కువని చెప్పక తప్పదు. హైదరాబాద్ కంటే మెరుగ్గా.. రంగారెడ్డి నిలిచింది. ఈ జిల్లాలో 57.62 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లలో అత్యధిక ఓట్లు ఉన్న ఈ జిల్లాలో పోలింగ్ పరంగా చూస్తే.. చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. అతి తక్కువ పోలింగ్ జరిగిన జిల్లాల్లో మూడో స్థానంలో మహబూబ్ నగర్ నిలిచింది. 58.49 శాతమే పోలింగ్ నమోదు కావటం గమనార్హం.