Begin typing your search above and press return to search.

రేవంత్ నివాసం వ‌ద్ద హైడ్రామా!

By:  Tupaki Desk   |   28 Sep 2018 7:55 PM GMT
రేవంత్ నివాసం వ‌ద్ద హైడ్రామా!
X
గ‌డిచిన కొద్దిరోజులుగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చెబుతున్న‌ట్లే ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. త‌న‌పై ఐటీ.. ఈడీ అధికారులు దాడులు జ‌ర‌ప‌టం ఖాయ‌మ‌ని.. అందుకు త‌గ్గ‌ట్లు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యాన్ని ప‌లుమార్లు రేవంత్ చెప్పారు. దీనికి త‌గ్గ‌ట్లే గురువారం ఆయ‌న‌కు చెందిన నివాసంతో పాటు.. దాదాపు 20 చోట్ల అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

రేవంత్ కు చెందిన ఒక ఇంటికి తాళాలు వేసి ఉంటే.. ఆ ఇంటి త‌లుపుల్ని బ‌ద్ధ‌లు కొట్టి మ‌రీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న్ను వెంట‌నే హైద‌రాబాద్‌కు రావాల‌ని అధికారుల నుంచి పిలుపు రావ‌టం.. హుటాహుటిన రేవంత్ హైద‌రాబాద్‌ కు చేరుకోవ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. గురువారం జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌కు కొన‌సాగింపుగా శుక్ర‌వారం ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.రేవంత్‌ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు కాంగ్రెస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. రేవంత్ ఇంటి వ‌ద్ద ఆందోళ‌నకు దిగారు. రేవంత్‌ను త‌మ‌కు చూపించాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం సాగ‌గా.. పోలీసులు అతి క‌ష్ట‌మ్మీద నిలువ‌రించారు. దీంతో.. రేవంత్ నివాసం ద‌గ్గ‌ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో అభిమానుల్ని.. సానుభూతిప‌రుల్ని సంతృప్తి ప‌ర్చ‌టం కోసం.. త‌న‌కు ఎలాంటి ముప్పు లేద‌న్న‌ట్లుగా ఇంటి వెలుప‌ల‌కు వ‌చ్చిన రేవంత్ అక్క‌డి వారికి అభివాదం చేసి లోప‌ల‌కు వెళ్లిపోయారు.

అయినా.. రేవంత్ అభిమానులు. సంతృప్తి ప‌డ‌లేదు. రేవంత్‌ కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమంటే.. ఈ సంద‌ర్భంగా రేవంత్ ఫోటోల‌కు ఆయ‌న అభిమానులు పాలాభిషేకాన్ని చేసి త‌మ‌కున్న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రోవైపు రేవంత్‌ కు ప్రాణ‌హాని ఉన్న‌ట్లుగా అనుమానం క‌లుగుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ నేత సీత‌క్క ఆందోళ‌న వ్య‌క్తం చేవారు. ఇన్ని గంట‌ల పాటు గృహ‌ నిర్బందంలో ఉంచాల్సిన అవ‌స‌రం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ఒక భూ క‌బ్జాదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో త‌నిఖీలు చేస్తున్నారంటూ మండిప‌డ‌డ్ఆరు. ఓట‌మి భ‌యంతోనే కేసీఆర్ ప్రోద్బ‌లంతోనే త‌నిఖీలు సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రోవైపు.. రేవంత్ సాయంతో కొన్ని బ్యాంక్ లాక‌ర్లను అధికారులు తెరిపించిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.