Begin typing your search above and press return to search.

చిదంబ‌రం కుటుంబానికి ఇది *బ్లాక్* ఫ్రై డే !

By:  Tupaki Desk   |   11 May 2018 3:24 PM GMT
చిదంబ‌రం కుటుంబానికి ఇది *బ్లాక్* ఫ్రై డే !
X
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబ‌రాన్నిఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ కేసులో కార్తీకి సంబంధం ఉంద‌ని, ఆయ‌న అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని ఈడీ ఆరోపించింది. కొద్ది రోజుల పాటు కార్తీ తీహార్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌న క్ల‌యింట్ ను కావాల‌నే ఈ కేసులో ఇరికించార‌ని, ఆయ‌న ఎటువంటి అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని కార్తీ త‌ర‌ఫు న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ వాదించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా, మ‌రోసారి చిదంబరం కుటుంబానికి ఆదాయం పన్ను శాఖ షాక్ ఇచ్చింది. చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిపై 'నల్లధనం చట్టం' కింద శుక్రవారం నాడు ఛార్జిషీట్లను ఐటీ శాఖ దాఖలు చేసింది. చిదంబ‌రం కుటుంబానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను వెల్లడించలేదని, అందుకే వారిపై చార్జిషీట్లు నమోదు చేశామ‌ని ఐటీ శాఖ తెలిపింది. ఇప్ప‌టికే కార్తీ వ్య‌వ‌హ‌రంతో ఇబ్బందుల్లో ప‌డ్డ చిదంబ‌రానికి తాజాగా ఐటీ శాఖ చార్జిషీటు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది.

త‌న కుమారుడు కార్తీ పై ఈడీ ద‌ర్యాప్తు త‌ర్వాత మ‌రోసారి చిదంబ‌రం చిక్కుల్లో ప‌డ్డారు. చిదంబ‌రంతో పాటు ఆయ‌న భార్య‌, కుమారుడు, కోడ‌లుపై ఐటీ శాఖ చార్జిషీటు దాఖ‌లు చేసింది. నల్లధనం (వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులు) మరియు ఇంపొజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015లోని సెక్షన్ 50 ప్ర‌కారం ఐటీ శాఖ ఈ ఛార్జిషీట్లు దాఖ‌లు చేసింది. చిదంబ‌రం కుటుంబానికి యూకేలోని కేంబ్రిడ్జిలో రూ.5.37 కోట్ల స్థిరాస్తులు, రూ.80 లక్షల ఆస్తులు ఉన్నాయ‌ని....అమెరికాలో రూ.3.28 కోట్ల ఆస్తులున్నాయని ఐటీ శాఖ చార్జిషీటులో పేర్కొంది. ఈ వివ‌రాల‌ను చిదంబ‌రం కుటుంబ‌స‌భ్యులు వెల్లడించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. బ్లాక్ మనీ చట్టాన్ని వారు ఉల్లంఘించార‌ని తెలిపింది. విదేశాల్లో భార‌తీయుల నల్లధనం పై విచార‌ణ జ‌రిపేందుకు మోదీ స‌ర్కార్ 2015లో ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. మ‌రోవైపు, ఈ చార్జి షీట్ ను మద్రాసు హైకోర్టులో కార్తీ సవాలు చేశారు.అయితే, కార్తీ రిట్ పిటిషన్ ను మ‌ద్రాసు హైకోర్టు కొట్టేసింది. ఈ నేప‌థ్యంలో చిదంబ‌రం కుటుంబానికి మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పేలా లేవు.