Begin typing your search above and press return to search.

స‌మాచారం ఇచ్చి మ‌రీ ఐటీ దాడులా?

By:  Tupaki Desk   |   25 Oct 2018 8:10 AM GMT
స‌మాచారం ఇచ్చి మ‌రీ ఐటీ దాడులా?
X
టీవీ ఛాన‌ల్స్ లో కొన్ని స్క్రోలింగ్స్ చూస్తే న‌వ్వు వ‌చ్చే ప‌రిస్థితి. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో ఏపీలో మాత్ర‌మే క‌నిపించే సిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తుంటుంది. ఐటీ కానీ ఈడీ కానీ త‌నిఖీలు చేసే విష‌యాన్ని ప‌క్క‌నోడికి కూడా తెలీన‌ట్లుగా గుట్టుచ‌ప్పుడు కాకుండా చేస్తుంటారు.

కానీ.. ఇందుకు భిన్నంగా ఏపీలో మాత్రం ఐటీ అధికారుల త‌నిఖీల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న మాట‌ను పెద్ద ఎత్తున మీడియాలో వ‌చ్చేస్తుంటుంది. అంతేనా.. ఐటీ అధికారులు భారీగా విజ‌య‌వాడ‌కు వ‌చ్చార‌ని.. వారంతా హోట‌ల్స్ లో మ‌కాం వేశార‌ని.. ఫ‌లానా వారిని క‌లుస్తున్నార‌ని.. త్వ‌ర‌లో వారు త‌నిఖీల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తుంటాయి. ఇంత భారీగా ప్ర‌చారం జ‌రిగిన‌ప్పుడు.. ఎవ‌రి మీద త‌నిఖీలు చేస్తున్న విష‌యం స‌ద‌రు వ్య‌క్తుల‌కు తెలీకుండా ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఇటీవ‌ల కాలంలో ఏపీ అధికార‌ప‌క్షం కేంద్రం మీద విమ‌ర్శ‌లు చేస్తూ.. త‌మ మీద క‌క్ష సాధింపు చ‌ర్య‌ల కోస‌మే ఐటీ.. ఈడీ శాఖ‌ల్ని త‌మ మీద‌కువ‌దులుతున్నార‌ని.. కావాల‌నే త‌మ‌ను ఇబ్బంది పెడుతున్న‌ట్లుగా ఆరోపిస్తున్నారు. నిజంగానే.. ఐటీ.. ఈడీలు టీడీపీ నేత‌ల్ని ఇబ్బంది పెట్టేందుకే త‌నిఖీలు చేస్తుంటే.. తాము వ‌స్తున్న విష‌యాన్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అంతేకానీ.. బాబు అండ్ కోకు ముందస్తుగా స‌మాచారం ఇచ్చి మ‌రీ త‌నిఖీలు చేయ‌రు క‌దా? అన్న సందేహం రాక మాన‌దు.

టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ ఆస్తుల మీద ఐటీ దాడులు జ‌ర‌గ‌టానికి ముందు కూడా.. ఆ విష‌యాన్ని ముందే చెప్పేసిన ప‌రిస్థితి. స‌మాచారం బ‌య‌ట‌కు పొక్కి మ‌రీ ఐటీ దాడులు చేయ‌టం ఏమిటి? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో మ‌రోసారి భారీగా త‌నిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సిద్ధ‌మైన‌ట్లుగా కొన్ని ఛాన‌ల్స్ లో బ్రేకింగ్ న్యూస్ లు ప‌డుతున్నాయి.

త‌నికీల ముచ్చ‌టే కాదు..ఏపీలోని ఏయే ప్రాంతాల్లో త‌నిఖీలు చేప‌ట్ట‌నున్నార‌న్న విష‌యం మీదా వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌టం విశేషం. విశాఖ‌లో ఇప్ప‌టికే త‌నిఖీలు షురూ అయ్యాయ‌ని.. విజ‌య‌వాడ‌.. గుంటూరు.. నెల్లూరుల‌లో సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. హెడ్డాఫీసు నుంచి సంకేతాలు వ‌చ్చినంత‌నే తాము దాడులు చేస్తామ‌ని చెబుతున్న తీరు కాస్తంత కామెడీగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదంతా ఎందుకు.. ఎవ‌రి ఇళ్ల మీదా.. ఎవ‌రి ఆఫీసుల మీద సోదాలు నిర్వ‌హించే అంశాన్ని ముందే లీకులు ఇచ్చేస్తే.. మ‌రింత బాగుంటుంది క‌దా? అన్న వ్యంగ్య వ్యాఖ్య‌లు ప‌లువురి నోటి నుంచి వినిపిస్తున్నాయి.