Begin typing your search above and press return to search.

టోకరా ఇచ్చినోళ్లంతా దొరికిపోతారట

By:  Tupaki Desk   |   4 Jan 2017 6:32 AM GMT
టోకరా ఇచ్చినోళ్లంతా దొరికిపోతారట
X
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. కొద్దిమంది తమ దగ్గరి నల్లధనాన్ని మార్చుకునేందుకు చాలానే మార్గాల్ని ఆశ్రయించారు. కొందరైతే తమకు మాత్రమే తెలివితేటలు ఉన్నట్లుగా వ్యవహరించి.. రకరకాల మార్గాల్ని అనుసరించారు. అయితే.. ఇలాంటి వాటన్నింటి నిగ్గు తేల్చేందుకు ఐటీశాఖ మహా వడబోతను షురూ చేసినట్లుగా చెబుతున్నారు. ఐటీశాఖ కన్నుగప్పేందుకు జరిగిన అన్ని ప్రయత్నాల్ని వమ్ము చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సాయాన్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తమ వద్దనున్న పెద్దనోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు డిసెంబరు 30 వరకు గడువు ఇచ్చారు. ఆదాయపన్ను పరిధిలోకి రాకుండా ఉండేందుకు కొందరు.. పాతనోట్లను కమిషన్ కక్కుర్తితో మార్చుకున్నోళ్లు మరికొందరు.. సాయం చేసేందుకు ఇంకొందరు ఇలా కొంతమంది అక్రమ మార్గాల్ని పట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఐటీశాఖ సిద్ధం చేసుకుంది.

ఒకే వ్యక్తికి పలు ఖాతాలు ఉన్నప్పటికీ.. మొత్తంగా ఒకే ఖాతాగా చూపిస్తూ.. ఎంత మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వైనాన్ని గుర్తించటంతో పాటు.. అప్పటివరకూ బ్యాంకు ఖాతాల్ని సరిగా నిర్వహించకుండా.. ఒక్కసారిగా పెద్ద మొత్తాల్ని వేసుకున్న వారి ఖాతాలపై ఐటీ శాఖ గురి పెడుతోంది. ఇవే కాక.. ఒకే కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు వేర్వేరు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసినా.. ఆ విషయాన్ని గుర్తించేలా ఏర్పాట్లు చేసింది. పాన్.. ఆధార్ నంబర్ల సాయంతో గుట్టుచప్పుడు కాకుండా.. ఐటీ శాఖ కళ్లు గప్పేలా డిపాజిట్లు చేసిన మొత్తాలకు సంబంధించిన అసలు లెక్కను బయటకు తీసే పనిలో భాగంగా మహా వడపోతను చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రాధమిక సమాచారాన్ని చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నగదు డిపాజిట్ అయినట్లుగా తెలుస్తోంది. వీటిల్లో లెక్కల్లో చూపించిన మొత్తం ఎంత? లెక్కల్లోకి చూపించకుండా ఉన్న డిపాజిట్లు ఎన్ని అన్న విషయాన్ని లెక్క తేలుస్తున్నట్లు చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రకటన చేసిన తర్వాత నుంచి డిసెంబరు 31వరకూ జరిగిన బ్యాంకు లావాదేవీలపై కన్నేసిన ఐటీశాఖ.. అక్రమార్కులకు నోటీసులు.. అనుమానితులపై దాడులు చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/