Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తోందే!

By:  Tupaki Desk   |   14 Nov 2017 7:38 AM GMT
చిన్న‌మ్మ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తోందే!
X
త‌మిళ‌నాట అధికారాన్ని ఒడిసిప‌ట్టాల‌ని భంగ‌ప‌డిన శ‌శిక‌ళ‌కు వ‌రుస క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. జ‌య‌ల‌లిత త‌ర్వాత తానే రాష్ట్రానికి మ‌కుటంలేని మ‌హ‌రాణిన‌ని భావించిన శ‌శిక‌ళ‌కు షాకుల మీద‌ షాక్‌ లు త‌గులుతున్నాయి. ఇక ప‌ద‌వీ స్వీకార‌మే త‌రువాయి అనుకున్న త‌రుణంలో కోర్టు తీర్పుతో అక్ర‌మాస్తుల కేసులో జైలుపాలైన చిన్న‌మ్మ‌కు తాజాగా జ‌రిగిన ఐటీ దాడులు గోరుచుట్టుపై రోక‌టిపోటులా మారాయి. శశికళ కుటుంబం - స‌న్నిహితులే ల‌క్ష్యంగా త‌మిళ‌నాడులో ఐదు రోజులపాటు జ‌రిగిన వ‌రుస‌ ఐటీ దాడుల్లో ప‌లు కీల‌క‌ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 1800 మంది అధికారులు ఏకకాలంలో ఐటీ దాడులకు దిగి స్వాధీనం చేసుకున్న రికార్డులు - దస్తావేజులు - నగదు - నగలు - ఇతర ఆస్తులు - పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను చెన్నైలోని ఐటీ కార్యాలయానికి తరలించారు.

నుంగంబాక్కంలో ఉన్న ఐటీ కార్యాలయంలో ఐదు వందల మంది అధికారుల బృందం డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. ఇటీవ‌ల శశికళ పెరోల్‌ మీద బయటకు వచ్చిన సమయంలో ఆస్తులను బంధువులు - సన్నిహితులు - నమ్మ‌క‌స్తులైన పనివాళ్లు - కారు డ్రైవర్లు తదితరుల బినామీల పేరిట డాక్యుమెంట్లను మార్చిన‌ట్లు పరిశీలనలో వెలుగు చూసినట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దు సమయంలో చిన్న‌మ్మ బ్యాచ్ దాదాపు రూ.250 కోట్ల పాత కరెన్సీని మార్చినట్టుగా ఐటీ అధికారుల‌ పరిశీలనలో తేలింది. అలాగే, కొన్ని చోట్ల ఆ నోట్లను మార్చేందుకు వీలులేక‌.. అలాగే, వదిలి పెట్టి ఉండడాన్నీ గుర్తించారు. కొడనాడు ఎస్టేట్‌ లో పెద్ద ఎత్తున పాత నోట్లు - మూడు కేజీల బంగారం బయటపడ్డట్టు ప్ర‌చారం సాగుతోంది. అక్కడి మేనేజర్‌ చంద్రశేఖర్‌ ను రహస్య ప్రదేశంలో ఉంచి ఐటీ వర్గాలు విచారిస్తున్నాయి. ఈ ఎస్టేట్‌ ను తన తండ్రి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నట్టు ఇంగ్లాండ్‌ కు చెందిన గ్రేక్‌ జాన్స్‌ కుమారుడు పీటర్‌ గ్రేక్‌ జాన్స్‌.. జయలలిత మరణించాక ఆరోపించారు. ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో చట్టవిరుద్ధంగా తమ ఆస్తిని శశికళ కుటుంబం దోచుకుందని - ఇక చట్టపరంగా తాను మళ్లీ స్వాధీనం చేసుకుంటాన‌ని పీటర్‌ ధీమా వ్యక్తం చేశారు.

తనిఖీలు ముగియడంతో చిన్నమ్మ కుటుంబీకుల్ని - సన్నిహితుల్ని విచారణ వలయంలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. శ‌శిక‌ళ స‌న్నిహితుల‌ను ఒక్కొక్కరినీ విచారించేందుకు వీలుగా 355 మందికి సమన్లు సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది. వీటిలో తొలి సమన్‌ దినకరన్‌ మద్దతుదారుడు పుహలేంది - జయలలిత వైద్యుడు డాక్టర్‌ శివకుమార్ - అమ్మ సహాయకుడు పూంగుండ్రం అందుకున్నారు. సోమవారం విచార‌ణ‌కు హాజ‌రైన ఈ ముగ్గురిని ఐటీ ప్రత్యేక బృందం అధికారులు పలు కోణాల్లో ప్ర‌శ్నించి సమాధానాలు రాబట్టే యత్నం చేసినట్టు తెలిసింది. పుహలేందిని బుధవారం మరోమారు విచారణకు రావాలని ఆదేశించడం కూడా మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టే వ్యూహ‌మేన‌ని అంటున్నారు. ఇక స‌మ‌న్లు అందుకున్న‌ చిన్నమ్మ సోదరుడు దినకరన్‌ మన్నార్‌ గుడి నుంచి చెన్నై బ‌య‌లుదేరారు. డొనేషన్ల పేరిట నగదు మార్పిడి - తన కళాశాల ద్వారా పెద్ద నోట్ల రద్దు సమయంలో సాగిన వ్యవహారాలు - ఇతర ఆస్తులతో పాటు శ‌శ‌క‌ళ‌ను ల‌క్ష్యంగా చేసుకుని దివాకరన్‌పై ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఐటీ సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి.

శ‌శిక‌ల బంధువులు - స‌న్నిహితుల‌ను ఒక్కొక్క‌రినీ వేర్వేరు సమయాల్లో విచారించేలా సమన్ల జారీ చేసేందుకు మరో బృందం నిమగ్నమైంది. ఈ నేప‌థ్యంలో శశికళ మేన‌ల్లుడు వివేక్‌ ను ఐటీ అధికారులు తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లడంతో చిన్నమ్మ కుటుంబీకుల మెడకు ఉచ్చు బలంగానే బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయలలిత ఇంట పెరిగిన వివేక్‌ ఆమె రేషన్‌ కార్డులోనూ చోటు దక్కించుకోవ‌డం గమనార్హం. జ‌య‌ మరణం తర్వాత వివేక్ పది సంస్థలకు డైరెక్టర్‌ గా - జయ టీవీ - నమదు ఎంజీఆర్‌ పత్రిక - జాస్‌ సినిమాస్‌ లకు సీఈఓగా అవతరించారు. త‌నిఖీల‌న్నీ ముగించిన ఐటీ అధికారులు చిట్టచివరగా వివేక్‌ ను తమ వెంట‌ తీసుకెళ్లడంతో చిన్నమ్మ కుటుంబంలో ఆందోళన రెట్టింపు అయింది.

త‌మిళ‌నాడుతో పాటు పుదుచ్చేరిలో దినకరన్‌ సన్నిహితుడిగా ఉన్న తెన్నరసుకు చెందిన శ్రీలక్ష్మి జ్యెవెలరీస్‌ లో లభించిన ఆధారాల మేరకు రూ.160కోట్ల నగదును కొత్త నోట్లుగా మార్చిన‌ట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ జ్యువెలరీస్‌ లో లెక్కలోకి రాని బంగారం బయటపడడమే కాకుండా, ఇందులో ఓ సినీ నటుడికి వాటా కూడా ఉన్నట్టు విచారణలో తేలినట్టు చెబుతున్నారు. జ‌య‌ల‌లిత పంచ‌న చేరిన చిన్నమ్మ కుటుంబం అక్రమార్జన సాగించినట్టు రికార్డుల పరిశీలనలో వెలుగులోకి వస్తున్నట్టుగా ఐటీ వ‌ర్గాల్లో చర్చ సాగుతోంది. మ‌రోవైపు.. అన్నాడీఎంకేలో దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఎమ్మెల్యేలు ఐటీదాడులపై నోరు మెద‌ప‌డంలేదు. చిన్న‌మ్మ వ‌ర్గ‌మే ల‌క్ష్యంగా దాడులు జ‌రిగిన నేప‌థ్యంలో పెద‌వి విప్పితే.. త‌మ‌ను ఎక్క‌డ టార్గెట్ చేస్తారోన‌న్న ఆందోళన వారిలో నెల‌కొంది. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో శ‌శిక‌ళ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం. పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభ‌విస్తున్న ఆమె అర్ధరాత్రి వరకు జైల్లోని టీవీ వద్ద వార్తల్ని చూస్తున్నట్టు, ఉదయాన్నే పత్రికల్ని తెప్పించుకుంటున్న‌ట్లు తెలిసింది.