Begin typing your search above and press return to search.

వాద్రా కేసు ఏంటీ?... ఇప్పుడే విచార‌ణ‌లో వేగం ఎందుకు?

By:  Tupaki Desk   |   10 Feb 2019 4:10 AM GMT
వాద్రా కేసు ఏంటీ?... ఇప్పుడే విచార‌ణ‌లో వేగం ఎందుకు?
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ బావ‌గారిగా, ప్రియాంకా గాంధీ భ‌ర్త‌గా రాబ‌ర్ట్ వాద్రాకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేద‌నే చెప్పాలి. యూపీఏ అధికారంలో ఉండ‌గానే... హ‌ర్యానా, రాజ‌స్థాన్‌ ల‌లో వెలుగుచూసిన భూ కుంభ‌కోణాల్లో వాద్రా కంపెనీల‌కు పాత్ర ఉందంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, ఆ త‌ర్వాత ఈ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అశోక్‌ ఖేమ్కా బ‌దిలీ వ్వ‌వ‌హారం పెను సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం పెద్ద‌గా అటు వాద్రా, ఇటు గాంధీ ప్యామిలీని పెద్ద‌గా ఇబ్బంది పెట్టలేక‌పోయినా.. ఇప్పుడు ఈడీ న‌మోదు చేసిన కేసులో మాత్రం వాద్రాతో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. స‌రిగ్గా... ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల‌క బాధ్య‌త‌లు స్వీక‌రించిన రోజునే వాద్రాను విచార‌ణ‌కు పిలిచిన ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)... ఈ కేసులో వాద్రా దాదాపుగా దొరికిపోయిన‌ట్టేన‌న్న క‌ల‌రింగ్ ఇచ్చింది. బుద‌, గురువారాల్లో వాద్రాను విచారించిన ఈడీ... శుక్ర‌వారం ఒక్క‌రోజు గ్యాప్ ఇచ్చి తిరిగి శ‌నివారం కూడా విచార‌ణ‌కు ఆయ‌న‌ను ర‌ప్పించింది. శ‌నివారం నాటి విచార‌ణ‌లో భాగంగా సుదీర్ఘంగా 15 గంట‌ల పాటు వాద్రాను విచారించిన ఈడీ... ఏ మేర వివ‌రాల‌ను సేక‌రించిందో తెలియాల్సి ఉంది.

అయితే ఈడీ ఇప్ప‌టిదాకా సేక‌రించిన వివ‌రాల గురించిన అంశాన్ని ప‌క్క‌న‌బెడితే... అసలు వాద్రాపై ఈడీ న‌మోదు చేసిన కేసు ఏమిట‌న్న విష‌యం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ కేసు పూర్వ‌ప‌రాల్లోకి వెళితే.. యూపీఏ హ‌యాంలో 2005లో ఓ రక్షణ ఒప్పందం, 2009లో ఓ పెట్రోలియం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు, ముఖ్యంగా రక్షణ ఒప్పందం ద్వారా లబ్ది పొందిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్‌ భండారి 2009లో లండన్‌ లోని 12 బ్య్రాన్‌ స్టన్‌ స్క్వేర్‌ లో ఓ భవనాన్ని తన కంపెనీ ‘వోర్టెక్స్‌’ ద్వారా 19 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. దాన్ని ఆ మరసటి ఏడాదే దుబాయ్‌ వ్యాపారి సీసీ థంపీకి విక్రయించారు. ఆ భవనం పునరుద్ధరణకు సీసీ థంపీ 65 వేల పౌండ్లు ఖర్చు పెట్టి.. ప‌నుల‌న్నీ పూర్తి అయిన వెంట‌నే తిరిగి ఆ భవనాన్ని... సంజయ్‌ భండారీకి సంబంధం ఉన్న ఓ సింటాక్‌ కంపెనీకి కొన్న రేటుకే... అంటే 19 లక్షల పౌండ్లకే విక్రయించారు. అంటే భండారీ కొనుగోలు చేసిన భవనం తిరిగి భండారీ చేతికే వచ్చిందన్న మాట. భండారి, సీసీ థంపీ, వాద్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నది ఈడీ అధికారుల వాదన. ఒప్పందాల్లో లబ్ది పొందినందుకుగాను భండారీ ఆ భవనాన్ని రాబర్ట్‌ వాద్రా కోసం ముడుపుల కింద కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ ఆరోప‌ణ‌కు సంబంధించి ఈడీ వ‌ద్ద ఉన్న‌ది ఒకే ఒక్క ఆధార‌మ‌ని చెప్పాలి. అదేంటంటే... 2016లో ఢిల్లీలోని సంజయ్‌ భండారీ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు ఓ కంప్యూటర్‌ లో భండారి బంధువుకు, వాద్రా కార్యదర్శికి మధ్య నడిచిన ఈమెయిళ్లు దొరికాయి. లండన్‌ లో ఉంటున్న భండారీ మేనల్లుడు సుమిత్‌ ఛద్దా, లండన్‌ భవనం పునరుద్ధరణ బిల్లుల చెల్లింపుల గురించి వాద్రా కార్యదర్శికి ఆ మెయిల్స్‌ పంపించారు. అందులో ఓ మెయిల్‌ కు వాద్రా స్వయంగా స్పందిస్తూ ‘రేపు ఉదయం ఈ విషయాన్ని పరిశీలిస్తాం. కార్యదర్శి మనోజ్‌ పరిష్కరిస్తారు’ అని పేర్కొన్నార‌ట‌. భవనం పునరుద్ధర ణకు అయిన 65 వేల పౌండ్లను వాద్రా చెల్లించారని, అందుకనే భండారి వద్ద కొన్న రేటుకు సీసీ థంపీ తిరిగి ఆ భ‌వ‌నాన్ని విక్రయించారని, తన ఆస్తి కావడం వల్లనే వాద్రా పునరుద్ధరణ ఛార్జీలు చెల్లించారన్నది ఈడీ అధికారుల అభియోగం. ఈ ఒక్క ఆధారం మిన‌హా వాద్రాపై న‌మోదు చేసిన కేసులో ఈడీ వ‌ద్ద మ‌రేమీ ఆధారాలు లేవ‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... సంజయ్‌ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్‌ సెట్‌ ఇండియా సొల్యుషన్స్‌ కంపెనీ అతి త‌క్కువ కాలంలోనే కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్‌ సంస్థ ‘పిలాటస్‌’తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్‌ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. లండన్‌ లోని ఆస్తులు, ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్‌ భండారి, తన ఇంటిపై 2016లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో నేపాల్‌ మీదుగా లండన్‌ పారిపోయారు. దాంతో లండన్‌ ఆస్తుల కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.

వాద్రా కార్యదర్శి, భండారి బంధువు మధ్య కొనసాగిన ఈ మెయిళ్లు మినహా మరో సాక్ష్యాన్ని ఈడీ అధికారులు సాధించలేకపోయారు. లండన్‌ లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్న రాబర్ట్‌ వాద్రాను విచారిస్తున్న అధికారులు, భండారీతో ఆయనకున్న సంబంధాల గురించే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. మ‌రి సింగిల్ ఆధారాన్ని ప‌ట్టుకుని ఈడీ వాద్రాను విచారిస్తున్న వైనంపై ఇప్పుడు పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. మ‌రి ఈ కేసు విచార‌ణ స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో మొద‌లు కావ‌డంతో రాజ‌కీయంగానూ ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి ఈ కేసు బీజేపీకి లాభిస్తుందో, లేదంటే... బీజేపీకి దెబ్బ కొట్టి కాంగ్రెస్‌పై సింప‌తీ క్రియేట్ చేస్తుందో చూడాలి.