Begin typing your search above and press return to search.

ఆలయంలోనూ సోదాలేంది మోడీసాబ్?

By:  Tupaki Desk   |   13 April 2019 5:19 AM GMT
ఆలయంలోనూ సోదాలేంది మోడీసాబ్?
X
ఓపక్క ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఐటీ.. ఈడీ సంస్థల సోదాలు జరుగుతున్నాయి. రెండు వైరుధ్యాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. సోదాలన్నీ కేంద్రంలోని మోడీ సర్కారు వ్యతిరేక రాజకీయ కుటుంబాల మీదా.. పార్టీలకు చెందిన వారి మీదనే అన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది.

జేడీఎస్ అధినేత.. మాజీ ప్రధాని దేవెగౌడ సొంతూరు అయిన హరదనహళ్లిలో వారికో టెంపుల్ ఉంది. ఆ ఆలయంలో తాజాగా ఆదాయపన్ను అధికారులు దాడులు నిర్వహించారు. మోడీకి.. జేడీఎస్ మధ్యనున్న పంచాయితీ అందరికి తెలిసిందే.

ఓపెన్ గానే విభేధాలు ఉన్నప్పుడు కాస్త ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కానీ.. అందుకు భిన్నంగా వరుస పెట్టి సాగుతున్న ఐటీ దాడులు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా దేవెగౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో.. ఈ ఉదంతం సంచలనంగా మారింది.

ఇద్దరు ఐటీ శాఖకు చెందిన అధికారులు శివాలయం పక్కనే ఉన్న తమ ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేపట్టారని.. అనంతరం వారు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించి సోదాలు మొదలెట్టినట్లుగా చెప్పారు. చివరకు పవిత్రంగా భావించే గర్భాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే.. తాము అడ్డుకున్నట్లు వారు చెబుతున్నారు.

దేవెగౌడ కుటుంబానికి సంబంధించిన సొమ్ములు ఇక్కడ ఉంచారా? అని తమను ప్రశ్నించినట్లుగా పూజారి కుటుంబం చెబుతోంది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. ఈ రోజు మా కుటుంబానికి చెందిన దేవాలయంలో సోదాలు నిర్వహించింది. అక్కడ నుంచి ఖాళీ చేతులతో బయటకు వచ్చారన్నారు.

ఈ తరహా అపవిత్రమైన చర్యల నేపథ్యంలో దేవుడు బీజేపీని రూపుమాపుతాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలవేళ విపక్షాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు.దేవాలయంలో తనిఖీలు చేపట్టిన అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తాజా గుడి తనిఖీలు బీజేపీకి నష్టం వాటిల్లేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.