Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ఇన్ని త‌ప్పులు చేశార‌ట‌!

By:  Tupaki Desk   |   29 Sep 2018 5:03 AM GMT
రేవంత్ రెడ్డి ఇన్ని త‌ప్పులు చేశార‌ట‌!
X
గ‌డిచిన రెండు రోజులుగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ ఇంటిపైనా..ఆయ‌న‌కు సంబంధించిన మ‌రికొన్ని చోట్ల ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కీ ఆయ‌న చేసిన త‌ప్పులు ఏంటి? వాటికి ఆధారాలు ఉన్నాయా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఐటీ శాఖ చెబుతున్న ప్ర‌కారం.. రేవంత్ చాలా త‌ప్పులు చేశార‌ని.. కోట్లాది రూపాయిల విలువైన ఆస్తుల్ని వేల‌ల్లో.. ల‌క్ష‌ల్లో చూపించేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇందుకు సంబంధించిన ప‌లు ప‌త్రాల్ని వారు చూపిస్తున్నారు. ఐటీ అధికారులు ప్ర‌స్తావిస్తున్న అంశాలు ఆస‌క్తిక‌రంగానే కాదు.. రేవంత్ అడ్డంగా బుక్ అయ్యార‌న్న భావ‌న‌ను క‌లిగించేలా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రేవంత్ చేసిన త‌ప్పుల్ని మూడు ముక్క‌ల్లో చెప్పాలంటే.. ఒక‌రి మీద భూములు కొనుగోలు చేయ‌టం.. కొంత‌కాలం త‌ర్వాత మ‌రొక‌రికి బ‌ద‌లాయించ‌టం.. ఆ భూమిని వెన‌క్కి తీసుకోవ‌టం లాంటివి చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

తాజా త‌నిఖీల్లో ఐటీ అధికారులు గుర్తించిన అంశాల్ని చూస్తే..

+ రేవంత్ రెడ్డి మామ ఎస్‌.పద్మారెడ్డి పేర బంజారాహిల్స్‌లో 355 చదరపు గజాల భూమిని రూ.75 వేలకు, అక్కడే మరో 339 చదరపు గజాల భూమిని రూ.74 వేలకు రేవంత్‌ రెడ్డి కొనుగోలు చేశారు. ఆ రెండు పత్రాల ప్రకారం ఆ భూమి విలువ రూ.1.49 లక్షలు మాత్రమే. మార్కెట్‌ విలువ రూ.12.55 కోట్లుగా ఐటీ శాఖ చెబుతోంది.

+ కోకాపేటలోని 19.36 ఎకరాల భూములను రేవంత్‌ తన కంపెనీల పేర కొనుగోలు చేసి, ఇతరులకు బదలాయించి, మళ్లీ బంధువుల పేర రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించింది. 2005లోనే ఆ భూమి మార్కెట్‌ విలువ రూ.90 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా.

+ ఉప్పల్‌ ఖల్సాలో 8,954 చదరపు గజాల భూమిని రేవంత్‌ రెడ్డి - ఆయన బంధువు రఘోత్తంరెడ్డి కొనుగోలు చేశారు. పత్రాల్లో భూ విలువ రూ.12.08 కోట్లు. నిజానికి దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది.

+ గోపన్‌పల్లిలో రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి పేరిట కొనుగోలు చేసిన భూమిలోనూ మార్కెట్‌ ధర కంటే చాలా తక్కువగా చూపించారని డాక్యుమెంట్లు చెబుతున్నాయి.

+ రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 44లో భార్య పేరిట 740 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. భవన నిర్మాణానికి బ్యాంకు నుంచి రూ.1.65 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ భవన నిర్మాణ విలువ అంతకంటే ఎక్కవని ఐటీ అధికారుల ఆరోపణ. బ్యాంక్‌ రుణానికి నెలకు రూ.1.7 లక్షలు ఈఎంఐ చెల్లించాలి. ఆమెకు ఆదాయం ఆ మేరకు ఉన్నట్లు చూపించలేదు.

+ అదే విధంగా రేవంత్ స‌తీమ‌ణి పేరు మీద ఎమ్మెల్యే కాలనీలో మరో ఇల్లు ఉంది. కొండారెడ్డిపల్లిలో 21.54 ఎకరాల భూమిని కొన్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఐటీ రిటర్న్స్‌లలో చూపించలేదు.

+ రేవంత్‌ రెడ్డికి 19 షెల్‌ కంపెనీలు ఉన్న‌ట్లుగా భావిస్తున్నారు. ఆ కంపెనీల్లో 24 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఒక కంపెనీలో ఉన్న వారే మరో కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. రేవంత్‌ రెడ్డి బావమరిది జయప్రకాశ్‌ మూడు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉంటే మరొకరు ఐదు కంపెనీల్లో ఉన్నారు. 19 కంపెనీల్లో ఏడు కంపెనీలు ప్రస్తుతం మూతపడ్డాయి.

+ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం - పన్ను ఎగవేత - తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించడం, ఎన్నికల సంఘానికి తప్పుడు ధ్రువపత్రాల సమర్పించడం వంటి అభియోగాలను రేవంత్‌రెడ్డిపై ఐటీ శాఖ న‌మోదు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.