Begin typing your search above and press return to search.

ఇదెక్కడి గోల మోడీ.. ప్రతి నెలా విద్యుత్ చార్జీల మోత?

By:  Tupaki Desk   |   13 Aug 2022 4:51 AM GMT
ఇదెక్కడి గోల మోడీ.. ప్రతి నెలా విద్యుత్ చార్జీల మోత?
X
తియ్యటి మాటలతో బోలెడన్ని ఆశల్ని కల్పించిన మోడీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలతో.. ఆయన్ను అమితంగా అభిమానించి ఓట్లేసిన కోట్లాది మంది తిట్టేసుకుంటున్న పరిస్థితి. పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలోఆయన ప్రభుత్వం కారణంగా మీద పడిన భారం అంతా ఇంతా కాదు. ఈ ధరా భారంతో భారతమంతా కిందా మీదా పడుతున్న పరిస్థితి. అయ్యగారిహయాంలోనే లీటర్ పెట్రోల్.. డీజిల్ ధర సెంచరీ దాటేయటం తెలిసిందే. తీవ్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో కాసింత ధర తగ్గించినప్పటికీ.. ప్రజల మీద భారం వేసే విషయంలో మోడీ సర్కారు వెనుకా ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటుందా? అన్న భావన కలిగేలా చేస్తోంది.

తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకురావటం.. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం.. ఇందులోని అంశాలుగా చెబుతున్నారు. చట్టంలోని వివిధ అంశాలు.. అభ్యంతరాల సంగతి ఎలా ఉన్నా. .ఇందులోని ఒక ప్రతిపాదన చూసినప్పుడు.. దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కొత్త విద్యుత్ చట్టాన్ని తప్పనిసరిగా వ్యతిరేకిస్తారని చెప్పక తప్పదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఆధారంగా రోజువారీగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటం.. తగ్గించటం చేస్తామంటూ ఆ మధ్యన నిర్ణయం తీసుకున్న మోడీ సర్కారు తర్వాతేం చేసిందో తెలిసిందే.

కాసింత ధర పెరిగినప్పుడు ధరను పెంచేసే సర్కారు.. ముడిచమురు ధరలు పడిపోయినప్పుడు మాత్రం కామ్ గా ఉండటం.. మొత్తంగా ఈ కొత్త విధానంతో లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంత భారీగా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఇదే విధానాన్ని కరెంటు చార్జీల విషయంలోనూ అమలు చేయాలన్నది కొత్త విద్యుత్ చట్టంలోని కీలక ప్రతిపాదన. విద్యుత్ కొనుగోలు ధరలు.. బొగ్గు.. ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ గా విద్యుత్ టారిఫ్ లో సర్దుబాటు చేసేలా కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిబంధన గురించి విన్నంతనే మంట పుట్టక మానదు.

ఈ విధానం కానీ అమల్లోకి వస్తే.. ఏ నెలకు ఆ నెల భారాన్ని వినియోగదారుల మీద మోపేలా ప్రతిపాదనను సిద్ధం చేశారని చెప్పాలి. ఇప్పుడు అమల్లో ఉన్న విద్యుత్ నిబందనలు 2005కు మోడీ సర్కారు కీలక సవరణలు చేపట్టటం తెలిసిందే. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతులను అన్ని రాష్ట్రాల ఇంధన శాఖలు.. ఈఆర్సీలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు పంపింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబరు 11 లోపు పంపాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ కొత్త ప్రతిపాదనల్లో ఎవరికి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని అంశాల్లో ఏ నెలకు ఆ నెల ధరల్ని పెంచుకునే వీలు కల్పించటం.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో మార్పులు.. డిమాండ్ కు అనుగుణంగా గ్రిడ్ నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసే వాటితో పెరిగే భారాన్ని.. ఏ నెలకు ఆ నెల వినియోగదారుల నడ్డి విరిచి మరీ వారి నుంచి పైసలు వసూలు చేయాలన్న ఆలోచనను మోడీ సర్కారు తెర మీదకు తీసుకొచ్చింది. ఈ విధానం అమల్లోకి వస్తే.. ప్రతి నెలా సవరించిన విద్యుత్ ఛార్జీలను ఏడాదికి ఒకసారి రాష్ట్రాల ఈఆర్సీలు సమీక్షించాల్సి ఉంటుంది.ఒకవేళ వసూలు చేసిన మొత్తం ఎక్కువగా ఉంటే వినియోగదారులకు తిరిగి చెల్లించటం.. అదే తక్కువగా ఉంటే వినియోగదారుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వానికి ఒకసారి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చే విషయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. విద్యుత్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు.. ఎందుకిలా చేస్తున్నారు? కారణం ఏమిటి? అన్న దానికి సంబంధించి శాంపిల్ గా బయటకు వచ్చిన ఈ విషయాన్ని చూస్తే.. సవరణ చట్టాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఇట్టే అర్థమవుతుంది. మొత్తానికి మోడీ మాష్టారు.. జనం నడ్డి విరిగే లెక్కలు బాగానే వేస్తున్నట్లున్నారుగా.