Begin typing your search above and press return to search.

ఆ పుకారుతో కాంగ్రెస్ కు దెబ్బపడింది!

By:  Tupaki Desk   |   10 Nov 2017 3:30 PM GMT
ఆ పుకారుతో కాంగ్రెస్ కు దెబ్బపడింది!
X
తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ అనే నినాదంతో.. తెరాస కాకుండా మరో పార్టీ ఆసరా కోసం చూస్తున్న చాలా మంది నాయకులకు కాంగ్రెస్ ఒక రకమైన ఆశలు కల్పించే ప్రయత్న చేస్తోంది. ఏకీకరణ సంగతేందో గానీ.. తెరాసలో కూడా ఫిరాయింపులు నాయకులు పెరగడం తదితర పరిణామాల్లో తమకు టికెట్ గ్యారంటీ ఉందనే నమ్మకం లేని నాయకులు పలువురు చాలా కాలంగా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటి వారికి ఇన్నాళ్లూ కాంగ్రెస్ మీద కూడా సరైన నమ్మకం కలగలేదు. తాజా చేరికల్తో చాలా మంది మొగ్గే పరిస్థితి ఏర్పడింది. అయితే లేటెస్టుగా పుట్టిన పుకార్లతో కాంగ్రెస్ కు దెబ్బ పడినట్లుగా అనిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు అనే వ్యవహారం రాబోయే ఎన్నికల్లోగా అయిపోతుందని.. తాజాగా పుకారు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా దీని మీద డోలాయమాన పరిస్థితి నడుస్తోంది. అటూ టూగా అంతా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 వరకు పెరిగే అవకాశం చట్టబద్ధంగా లేదనే మాట రావడంతో.. తెరాసలో అవకాశాలు పరిమతంగా ఉంటాయనుకుని కొందరు నాయకులు తెర వెనుక కాంగ్రెస్ లో చేరడానికి మంతనాలు చేసుకున్నారు. కాకపోతే.. ప్రస్తుతం కాంట్రాక్టులు గట్రా చేసుకుంటూ ఉంటారు గనుక.. మరి కొన్నాళ్లు గడిచాక పార్టీ మారడానికి నిశ్చయించుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో నియోజకవర్గాలు ఖచ్చితంగా పెరుగతాయనే పుకారు.. కాంగ్రెస్ పార్టీ దెబ్బే. నియోజక వర్గాలే పెరిగితే గనుక.. తెరాసలోనే తమకు టికెట్లు దక్కుతాయి గనుక.. కాంగ్రెస్ వైపు చూసిన చాలా మంది పునరాలోచనలో పడే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ కొత్త బలాన్ని పుంజుకుంటుంది అన్నమాటలో అబద్ధమేమీ లేదు. అయితే అది కేవలం తెలుగుదేశం పార్టీ అవశేష బలం మాత్రమేనా.. తెరాసలో ఉన్న బలం కూడా ఇటువైపు తరలివస్తుందా అనేది వారు ఎంత సక్సెస్ సాధించగలరు? తెరాసకు ప్రత్యామ్నాయం అని నాయకుల్ని ఎంతగా నమ్మించగలరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. నియోజకవర్గాల పెంపు మాత్రం... వారికి నష్టమే అనే అభిప్రాయం వినిపిస్తోంది.