Begin typing your search above and press return to search.

పెరిగిన పోలింగ్‌ తో ఎవ‌రికి లాభం?

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:48 AM GMT
పెరిగిన పోలింగ్‌ తో ఎవ‌రికి లాభం?
X
తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో కీల‌క అంక‌మైన పోలింగ్ ముగిసింది. ఓట‌ర్ల తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైంది. మ‌రో 24 గంట‌ల త‌ర్వాత ఓట‌ర్ల తీర్పు ఏమిట‌న్న విష‌యం వెల్ల‌డికానుంది. 2014 ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. ఈసారి పోలింగ్ పెర‌గ‌టం తెలిసిందే. మ‌రి.. పెరిగిన ఓటింగ్ శాతం ఎవ‌రికి అనుకూలంగా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సాధార‌ణంగా పెరిగిన ఓటింగ్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుగా అభివ‌ర్ణిస్తారు. అదే నిజ‌మైతే ప్ర‌జా కూట‌మికి ప్ర‌యోజ‌నం క‌లిగే అవ‌కాశం ఉంది.

అయితే.. పెరిగిన ఓటింగ్ పైన టీఆర్ ఎస్ వ‌ర్గాల వాద‌న మ‌రోలా ఉంది. పోలింగ్ పెద్ద ఎత్తున జ‌ర‌గ‌టం త‌మ‌కు లాభం చేకూరే అంశంగా టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 28 గంట‌ల క‌స‌ర‌త్తు అనంత‌రం ఈసారి ఎన్నిక‌ల్లో 73.2 శాతం పోలింగ్ న‌మోదైన విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. పెరిగిన పోలింగ్ తో త‌మ‌కే లాభ‌మ‌ని గులాబీ ద‌ళం కాన్ఫిడెంట్ గా ఉంటుంది.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయించి మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోలింగ్ పెరగ‌టం సానుకూలాంశంగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో పాత జిల్లాల లెక్క చూస్తే.. హైద‌రాబాద్ జిల్లా మిన‌హా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ పెరిగిన‌ట్లుగా చెప్పాలి. పెరిగిన పోలింగ్ తో త‌మ‌కే లాభ‌మ‌ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మి న‌మ్మ‌కంగా చెబుతోంది. ఇంత భారీ పోలింగ్ కు అర్థం కేసీఆర్ వ్య‌తిరేక‌త‌గా వారు అభివ‌ర్ణిస్తున్నారు. కేసీఆర్ మీద ఉన్న వ్య‌తిరేక‌త కార‌ణంగా ఓట‌ర్లు పెద్ద ఎత్తున స్పందించార‌ని.. త‌మ‌కే అధికారాన్ని క‌ట్ట‌బెట్ట‌నున్న‌ట్లుగా కూట‌మి నేత‌లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే..పెరిగిన ఓటింగ్ త‌మ‌కే క‌లిసి వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని గులాబీ బ్యాచ్ వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్న‌ట్లుగా లెక్క‌లు వేస్తోంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు పిధా అయిన గ్రామీణ ఓట‌రు పెద్ద ఎత్తున ఓట్లు వేసిన‌ట్లుగా టీఆర్ ఎస్ నేత‌లు విశ్లేషిస్తున్నారు.

గెలుపు సంగ‌తి ఎలా ఉన్నా.. పెరిగిన పోలింగ్‌ కు ఒక కీల‌కాంశం కార‌ణంగా ప‌లువురు చెబుతున్నారు. టీఆర్ ఎస్‌.. ప్ర‌జా కూట‌మి మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీ పోరుతోనే పోలింగ్ శాతాలు పెరిగిన‌ట్లుగా ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. అభ్య‌ర్థులు ఎవ‌రికి వారు ఎన్నిక‌ల్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌టంతో పోలింగ్ పైన కూడా ప్ర‌త్యేక దృష్టి సారించ‌టంతో భారీగా పోలింగ్ శాతం న‌మోదైన‌ట్లుగా చెబుతున్నారు. గెలుపుపై ఎవ‌రి ధీమా వారిదే అయినా.. అస‌లు ఫ‌లితం ఎలా ఉంద‌న్న విష‌యం మ‌రో రోజులో తేల‌నుంది.