Begin typing your search above and press return to search.

వారంలో రూ.3.75 చొప్పున పెంచేశారు.. రానున్న రోజుల్లో పడే భారమెంత?

By:  Tupaki Desk   |   28 March 2022 3:30 PM GMT
వారంలో రూ.3.75 చొప్పున పెంచేశారు.. రానున్న రోజుల్లో పడే భారమెంత?
X
అసలే వేసవి కాలం.. ఉక్కపోత. ఇది సరిపోదన్నట్లు ధరల మంట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచకుండా అట్టే ఉంచేసిన కేంద్రం.. ఇప్పుడు ఆ లెక్క మొత్తాన్ని చక్రవడ్డీతో సహా లాగేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల వేళలో నెలల తరబడి ధరలు పెంచకుండా ఉంచేసిన కేంద్రం.. కేవలం వారం వ్యవధిలో ధరల్ని పెంచేసిన వైనం చూస్తే..సామాన్యుడు.. మధ్యతరగతి జీవికి పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి.

గడిచిన వారం రోజులుగా రోజువారీగా బాదేస్తున్న కేంద్రం.. ఏ మాత్రం తగ్గట్లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన వారం వరకు ధరలు పెంచని మోడీ సర్కారు తీరుతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తమైంది. దాన్ని తగ్గిస్తూ.. మోడీ సర్కారు బాదటం మొదలు పెట్టింది.

ఈ నెల 22న లీటరు పెట్రోల్ మీద 90 పైసలు.. డీజిల్ 87 పైసలు చొప్పున షురూ అయిన బాదుడు ఆ తర్వాతి రోజున అంటే 23న పెట్రోల్ మీద 80 పైసలు.. డీజిల్ మీద 87 పైసల భారాన్ని మోపాడు. తర్వాతి రెండు రోజులు వరుసగా పెట్రోల్ మీద 90 పైసలు చొప్పున.. డీజిల్ మీద శనివారం 87పైసలు.. ఆదివారం 90 పైసలు చొప్పున బాదేశారు. దీంతో.. గడిచిన వారంలో లీటరు పెట్రోల్ మీద రూ.3.75 చొప్పున పెరిగితే.. డీజిల్ మీద రూ.3.70 పెరిగాయి.

ఈ బాదుడు ఇప్పట్లో ఆగేది లేదని.. అంతకంతకూ పెరగటం ఖాయమని చెబుతున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తున్నారు.

తాజాగా పెరిగిన ధరలు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల నేపథ్యంలో దేశంలో అత్యధికంగా లీటరు పెట్రోల్ ధర ఉన్న ఐదు నగరాలు.. అతి తక్కువ ధరలు ఉన్న మూడు నగరాల్ని చూస్తే.. ఎక్కువగా ఉన్న టాప్ ఐదు నగరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు నగరాలు (హైదరాబాద్, విజయవాడ) ఉండటం గమనార్హం.

నిత్యం సంక్షేమం మాటను వల్లె వేసే తెలుగు ముఖ్యమంత్రులు పెట్రోల్.. డీజిల్ విషయంలో ఎందుకంత కరకుగా ఉంటారు చెప్మా? విజయవాడ రూ.114.29 ముంబయి రూ.114.22 హైదరాబాద్ రూ.112.69 జైపూర్ రూ.111.64 కోల్ కతా రూ.108.86 తక్కువగా ఉన్న నగరాల్ని చూస్తే. 1.చండీగఢ్ రూ.98.85 2. లక్నో రూ.99.50 3.గురుగ్రామ్ రూ.99.88