Begin typing your search above and press return to search.

తాలిబన్ల దెబ్బకు 10 రెట్లు పెరిగిన హిజాబ్, బుర్ఖాల ధరలు

By:  Tupaki Desk   |   24 Aug 2021 12:10 PM IST
తాలిబన్ల దెబ్బకు 10 రెట్లు పెరిగిన హిజాబ్, బుర్ఖాల ధరలు
X
తాలిబన్ల రాకతో కాబూల్ లో మళ్లీ అరాచకం మొదలైంది. వారి రాక్షస పాలనను తలుచుకుంటూ జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మహిళల విషయంలో తాలిబన్లు కఠినమైన ఆంక్షలు విధిస్తారు. అందుకే కాబూల్ లో ఇప్పుడు బుర్ఖాల కోసం మహిళలు ఎగబడుతున్నారు. మార్కెట్ కొచ్చి వాటిని పెద్ద ఎత్తున కొంటున్నారు. దీంతో బుర్ఖాల ధరలకు రెక్కలొచ్చాయి.

అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నా వారి కఠిన నిబంధనల వల్ల మహిళలు అందరూ బుర్ఖాలు ధరించాలి. కాబూల్ లో బుర్ఖాల వినియోగం బాగా పెరిగింది. పాశ్చాత్య దుస్తులు ధరిస్తే తాలిబన్లు ప్రాణాలు తీస్తారని మహిళలు వణికిపోతున్నారు. అందుకే అందరూ బుర్ఖాల కోసం ఎగబడుతున్నారు.

కాబూల్ లోకి తాలిబన్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ధరలు ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయాయి. ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు.

గతంలో తాలిబన్ల పాలనలో మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. తమ శరీరంతోపాటు ముఖాన్ని బుర్ఖాతో కప్పుకునేవారు. మగవారి తోడు లేకుండా మహిళలు ఇల్లు దాటి బయటకు రావడాన్ని నిషేధించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన తాలిబన్ ప్రతినిధులు మహిళల హక్కులను గౌరవిస్తామని.. వారికి బుర్ఖా, హిజాబ్ తప్పనిసరి కాదని అన్నారు. అయినా అక్కడి ప్రజలు మాత్రం వారి మాటలు నమ్మకుండా బుర్ఖాలు కొనేందుకు పోటెత్తుతున్నారు.