Begin typing your search above and press return to search.

పెరుగుతోన్న కరోనా కేసులు.. చెమటలు పట్టేలా తాజా లెక్కలు

By:  Tupaki Desk   |   20 March 2020 7:20 AM GMT
పెరుగుతోన్న కరోనా కేసులు.. చెమటలు పట్టేలా తాజా లెక్కలు
X
ప్రభుత్వాలు ధీమాను ప్రదర్శిస్తున్నాయి. కరోనా విషయంలో అనవసరమైన కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే.. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. అనవసరమైన హడావుడి పడకూడదో.. మోతాదుకు మించిన ధీమా కూడా మంచిది కాదన్నది మర్చిపోకూడదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ కరోనా కేసుల నమోదు చూస్తే.. ఒక కీలకాంశం ఒకటి కనిపిస్తుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ లోనే మార్చి మూడు వరకు ఉంది. అంటే.. రెండు కేసుల నుంచి పది కేసులకు పెరగటానికి ఏకంగా ముప్పై మూడు రోజులు పడితే.. మార్చి నాలుగో తేదీకి వచ్చేసరికి కేసుల సంఖ్య ఒక్కసారిగా 29కి పెరిగిపోయాయి. మార్చి నాలుగు నుంచి పద్నాలుగు అంటే.. పది రోజుల వ్యవధిలో ఈ కేసులు 95కు చేరుకున్నాయి.

అంటే.. మొదటి ముప్ఫై రోజులకు ఆరు కేసులకు పరిమితమైతే.. తర్వాతి పదిహేను రోజులకే కేసులు వందకు దగ్గరకు వచ్చాయి. మార్చి 15నాటికి 109కు చేరిన పాజిటివ్ కేసులు.. మార్చి 20 నాటికి 251కు చేరుకోవటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు గడిచిన ఐదారు రోజుల్లో పాజిటివ్ కేసుల జోరు భారీగా పెరిగిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. కేవలం ఆరు రోజుల్లో 141 కేసులు కొత్తవి నమోదు కావటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరెంత పెరుగుతుందన్న సందేహం రాక మానదు.

దీనికి తోడు విదేశాల నుంచి వస్తున్న వారు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మార్గదర్శకాల్ని సరైన రీతిలో పాటించకపోవటం.. విదేశాల నుంచి దేశంలోకి అడుగు పెట్టినప్పుడు ఆరోగ్యంగా ఉంటే.. తమకేం జరగలేదన్న ఆలోచనలో ఉంటున్నారు తప్పించి.. శరీరంలోకి వైరస్ వెళ్లిన పది.. పదమూడు రోజల వరకూ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు. ఈ విషయంలో దొర్లుతున్న నిర్లక్ష్యం తాజాగా కేసుల సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశం ఇస్తుందన్నది చెప్పాలి. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి.. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చి వారి కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పక తప్పదు.

దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 20 శాతం ఆ రాష్ట్రానివే కావటం గమనార్హం. తర్వాతి స్థానంలో కేరళ నిలిచింది. ఆ రాష్ట్రంలో 40 పాజిటివ్ కేసులునమోదు కాగా.. మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 23 పాజిటివ్ కేసులు నమోదైతే.. నాలుగో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది.ఇండోనేషియా నుంచి వచ్చిన విదేశీయుల్లో పది మందికి పాజిటివ్ తేలటంతో ఈ తెలుగు రాష్ట్రంలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైన పరిస్థితి. శుక్రవారం నాటికి 19 పాజిటివ్ కేసులకు చికిత్స కల్పిస్తున్నారు. ఢిల్లీ.. రాజస్థాన్ లలో 17కేసులు చొప్పున నమోదు కాగా.. కర్ణాటకలో 15 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలికప్రాంతమైన లద్దాఖ్ లో 10 కేసులు నమోదయ్యాయి.

సింగిల్ డిజిట్ ను దాటని రాష్ట్రాల విషయానికి వస్తే.. గుజరాత్ (7).. చండీగఢ్ (5).. జమ్ముకశ్మీర్ (4).. మధ్యప్రదేశ్ (4).. తమిళనాడు (3).. పంజాబ్ (3).. ఆంధ్రప్రదేశ్ (3).. ఉత్తరాఖండ్ (3).. ఒడిశా (2).. పశ్చిమ బెంగాల్ (2).. హిమాచల్ ప్రదేశ్ (2).. పాండిచ్చేరి (1).. ఛత్తీస్ గఢ్ (1) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కసుల్లో విదేశాల నుంచి వచ్చిన భారతీయులతో పాటు.. స్థానికులు 213 మంది ఉంటే.. దేశానికి వచ్చిన విదేశీయులు 38 మంది కరోనా పాజిటివ్ గా నిలిచారు.