Begin typing your search above and press return to search.

అమెరికాలోని మనోళ్లకు రిలీఫ్...హెచ్1బీ వీసాల గడువు పెంపు

By:  Tupaki Desk   |   14 April 2020 4:00 PM GMT
అమెరికాలోని మనోళ్లకు రిలీఫ్...హెచ్1బీ వీసాల గడువు పెంపు
X
ప్రాణాంతక వైరస్ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న తరుణంలో... అగ్రరాజ్యం అమెరికాలోని మనోళ్ల పరిస్థితి కూడా డోలాయమానంలో పడిపోయిందన్న వార్తలు పెను కలకలం రేపుతున్న వేళ... అమెరికా ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో అక్కడి మనోళ్లంతా ఊపిరి పీల్చేసుకున్నారు. ఈ దిశగా భారత్ ప్రభుత్వం అమెరికా సర్కారుతో నెరపిన దౌత్య యత్నాలు ఫలించాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రవాస భారతీయుల వీసాల గడువు ముగిసినా... వెనువెంటనే తిరిగి మన దేశానికి రావాల్సిన అవసరం లేకుండా అమెరికా ప్రభుత్వం... హెచ్1బీ వీసాల గడువును ఏకంగా 8 నెలల మేర పొడిగించి మనోళ్లకు బిగ్ రిలీఫ్ ను అందించింది. ఈ దిశగా భారత ప్రభుత్వం అడిగిన వెంటనే వీసాల గడువు పెంపునకు అమెరికా వెనువెంటనే అంగీకరించింది.

కరోనా ధాటికి అతలాకుతలమైపోతున్న వేళలోనూ అగ్రరాజ్యం అమెరికా పెద్దన్న మనసు చాటుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో హెచ్1బీ వీసాదారుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దన్న భారత ప్రభుత్వం విన్నపానికి అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్కడ టెక్ నిపుణులుగా పనిచేస్తూ, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ల హెచ్1బీ వీసా గడువును ఏకంగా ఎనిమిది నెలలు పొడగించారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) మంగళవారం ఒక ప్రకటన చేసింది. సాధారణంగా అమెరికాలో నాన్ ఇమిగ్రంట్స్ ఎవరైనాసరే వీసా గడువు ముగిసిన తర్వాత రెండు నెలల లోపల దేశం విడిచి వెళ్లాలన్న నిబంధన ఉండేది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఊహించని విధంగా లాక్ డౌన్ నెలకొనడంతో... హెచ్1బీ వీసాల గడువును 8 నెలలపాటు పొడగిస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. ఈ మేరకు అప్లికేషన్ల స్వీకరణ మంగళవారం నుంచి మొదలుపెడుతున్నామని, సంబంధిత ఫామ్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు.

హెచ్‌1బీ వీసా గడువు ముగిసినా.. భారతీయ టెకీలను అక్రమ వలసదారుగా భావించరాదని, హెచ్1బీ వీసాతోపాటు అన్ని రకాల వీసాల గడువులను 90 రోజుల వరకు పెంచాలని భారత ప్రభుత్వంతోపాటు సాఫ్ట్ వేర్ కంపెనీల సమాఖ్య 'నాస్ కామ్స అమెరికా సర్కారుకు విజ్ఞప్తి చేసింది. హెచ్1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య దాదాపు 3లక్షలు ఉండొచ్చని అంచనా. వీళ్లలో కొద్దిమంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోగా, కరోనా దెబ్బకు మరింత మందిపై ఎఫెక్ట్ పడే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారత్ అడిగినదానికంటే మిన్నగా.. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం హెచ్1బీ సహా అన్ని రకాల వీసాల గడువులను 240 రోజులు(8నెలలు) పొడిగించడం గమనార్హం. హెచ్1బీ వీసాపై అమెరికాలో పని చేసేవారిని సంస్థ యాజమాన్యం తొలగిస్తే .. వెంటనే మరో సంస్థలో ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో హెచ్‌1బీ వీసా రద్దవుతుందని తెలిసిందే. దీనిపైనా యూఎస్‌సీఐఎస్ క్లారిటీ ఇచ్చింది. పొడగింపుతోపాటు అదనపు గడువు పొందేవాళ్లంతా.. అప్పటికే పనిచేస్తున్న సంస్థల్లో ఉద్యోగులుగానే కొనసాగుతారని, గతంలో ఏవైతే హక్కులు, సౌకర్యాలు పొందారో.. వచ్చే 8 నెలలపాటూ అనుభవించొచ్చని అధికారులు స్పష్టం చేశారు.

ట్రంప్ పాలనలో వలసదారులపై కఠిన నిబంధనలు అమలవుతోన్న నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళ‌న నెలకొంది. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేనందున వీసాల గడువును పెంచాలంటూ వేలాది మంది హెచ్‌-1బీ వీసాదారులు ట్రంప్ స‌ర్కారుకు లేఖ రాశారు. ఇటు భారత ప్రభుత్వం కూడా వినతులు చేసింది. ఈలోపే కరోనా చికిత్సలో వాడుతోన్న హైడ్రాక్వీ క్లోరోక్విన్(HCQ) డ్రగ్ ఎగుమతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. ‘"ఇంత పెద్ద మొత్తంలో మందులు పంపుతున్నప్పుడు.. మనవాళ్ల వీసాల గురించి ఎందుకు అడగరు?" అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా దీనిపై అమెరికాకు విజ్ఝప్తి చేసింది. వీసాల గడువులపై అమెరికా తాజా ప్రకటనతో భారత్ దౌత్యం ఫలించినట్లయింది. మొత్తంగా భారత్ చేసిన విజ్ఝప్తితో అమెరికాలో ఉంటున్న ఒక్క భారతీయులకే కాకుండా ఆ దేశంలో ఉంటున్న చాలా దేశాల వలసదారులకు కూడా బిగ్ రిలీఫ్ లభించిందనే చెప్పాలి.