Begin typing your search above and press return to search.

పెరిగిపోతున్న నేతల వలసలు

By:  Tupaki Desk   |   24 Oct 2022 4:22 AM GMT
పెరిగిపోతున్న నేతల వలసలు
X
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో నేతల వలసలు అయోమయం సృష్టిస్తున్నాయి. ఏ నేత ఏరోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే రాపోలు ఆనందభాస్కర్ వ్యవహారం. ఈయన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నేత. తర్వాత బీజేపీలో చేరారు. ఇపుడు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ లో కేసీయార్ తో ఆదివారం భేటీ అయ్యారు. సోమవారం టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు రాపోలే స్వయంగా ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇదే రాపోలు కొద్దిరోజులు మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఒకవైపు బీజేపీ తరఫున ప్రచారం చేస్తునే మరోవైపు టీఆర్ఎస్ లో చేరటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాయబారాలు, బేరాలు అన్నీ ఫైనల్ అయిన తర్వాతే హఠాత్తుగా బీజేపీ ప్రచారంలో నుండి పక్కకు వచ్చేసి నేరుగా ప్రగతిభవన్లో ప్రత్యక్షమయ్యారు. రాపోలు వ్యవహారంతో బీజేపీ నేతలే ఆశ్చర్యపోయారు.

ఉపఎన్నికల్లో గెలుపు అన్నీ పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారిపోయింది. ఈ కారణంగానే టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి. రెండుపార్టీల నేతలు ఏరోజు పార్టీ మారిపోతున్నారో ఆపార్టీల్లోని నేతలకే అర్ధంకావటంలేదు. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ మొన్నటివరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ లో లాభంలేదని దాసోజు రెండునెలల కిందటే బీజేపీలో చేరారు. ఇపుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు.

అలాగే స్వామిగౌడ్ కొద్దిరోజుల వరకు టీఆర్ఎస్ లోనే ఉండి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొద్దిరోజులకే మళ్ళీ కమలం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరిన తర్వాతే రెండు పార్టీల మధ్య వలసలు ఎక్కువైపోయాయి. పార్టీలో ఉండే నేతలెవరు ? వెళ్ళిపోయే నేతలెవరో తెలుసుకోవటానికే పార్టీల అధినేతలు ప్రత్యేకంగా నిఘా వ్యవస్ధను పెట్టుకోవాల్సొచ్చేట్లుంది. మొత్తానికి నేతల వలసల కారణంగా ఏ పార్టీకి కూడా సిద్ధాంతాలు, నియమ, నిబంధనలు లేవన్న విషయం జనాలకు స్పష్టంగా అర్ధమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.