Begin typing your search above and press return to search.

డేరాలకు ఫుల్లుగా పెరిగిపోయిన డిమాండ్

By:  Tupaki Desk   |   17 Feb 2022 5:32 AM GMT
డేరాలకు ఫుల్లుగా  పెరిగిపోయిన డిమాండ్
X
పంజాబ్ ఎన్నికల్లో డేరాలకు ఫుల్ గా డిమాండ్ పెరిగిపోతోంది. డేరాలంటే నలుగురు కూర్చునేందుకు వేసుకునే టెంట్లు అనుకునేరు. కాదు వేలు, లక్షల్లో భక్తులుండే డేరా బాబాలు. పంజాబ్ రాజకీయాల్లో డేరా బాబాలకు ప్రత్యేక స్థానముంది. డేరా బాబాల మద్దతు ఏ పార్టీకైతే ఎక్కువగా దొరుకుతుందో దాదాపు వారిదే విజయమని చెప్పచ్చు. అందుకనే ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు తద్వారా విజయం కోసం పార్టీల నేతలంతా డేరాబాబాల చుట్టూ తిరుగుతున్నారు.

సరిగ్గా ఎన్నికలకు రెండు వారాల ముందు డేరా సచ్చా సౌదా బాబా రాంరహీం గుర్మీత్ (డేరాబాబా) బెయిల్ పై విడుదలవడంతో ఒక్కసారిగా డేరా బాబాలపై చర్చలు పెరిగిపోయాయి. డేరా అంటే శిబిరం, మఠం అనే అర్థముంది.

అయితే పంజాబ్ లో ఇప్పుడు మాత్రం మఠం అనే అనుకోవాలి. ఎందుకంటే బాబాలకు వేలల్లో భక్తులున్నారు. బాబాలు ఎవరికి ఓట్లేయమంటే భక్తులు వాళ్ళకే ఓట్లేస్తారు. అందుకనే ఎక్కువ బాబాల ఆశీస్సులు దక్కించుకునేందుకు వివిధ పార్టీల నేతలు పోటీలు పడుతున్నారు.

డేరాలలో సంక్షేమ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్నింటిలో డ్రగ్స్ కు బానిసలైన వారి పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం మీద డేరాలలో చాలావాటి మీద జనాల్లో ఒక విధంగా పాజిటివ్ అభిప్రాయమే ఉంది. అందుకనే బాబాలు అంతటి శక్తిమంతులుగా ఎదిగిపోయారు. వీరిలో సచ్చా సౌదా డేరా బాబా చాలా పాపులరనే చెప్పాలి. పంజాబ్ లో బాగా పాపులరైన రవిదాసియా డేరాలు. వీటిలో కూడా సచ్ ఖండ్ బల్లాన్ కీలకమైంది.

సిక్కుడేరాలలో బండేయి ఖల్సా, నానక్ పాంథీస్, సేవా పాంథీస్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. రాష్ట్రంలో మూడో వంతు దళితులే ఉన్నారు. వీళ్ళని టార్గెట్ చేసుకునే చాలా డేరాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కాబట్టే దళితులు, రైతుల్లో డేరాబాబాలంటే బాగా గురి. మొన్ననే జైలు నుంచి విడుదలైన డేరాబాబాకు మాల్వా ప్రాంతంలోని లక్షలాది దళితుల్లో తిరుగులేని ఆధిపత్యముంది. ఈ డేరా బాబా ఎంత చెబితే వాళ్ళకు అంత.

శిరోమణి అకాలీ దళ్-బీఎస్పీ కూటమికి గుర్మంత్ సిద్ధాంత్ ప్రచారక్ సంత్ సమాజ్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. కాబట్టి పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది కాబట్టి మిగిలిన డేరాలు కూడా మద్దతు ప్రకటించబోతున్నాయి. అందుకనే రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి.