Begin typing your search above and press return to search.

రోహిత్.. నీకు రివ్యూ కోరి.. రాహుల్ కు కోరవా? ఇదేనా కెప్టెన్ లక్షణం..?

By:  Tupaki Desk   |   28 Oct 2022 9:44 AM GMT
రోహిత్.. నీకు రివ్యూ కోరి.. రాహుల్ కు కోరవా? ఇదేనా కెప్టెన్ లక్షణం..?
X
నెదర్లాండ్స్ తో గురువారం జరిగిన టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి స్థాయితో పోలిస్తే.. ఈ విజయం పెద్ద లెక్కలోది కాదు. కానీ.. ప్రపంచ కప్ లాంటి టోర్నీ వరకు వచ్చిన ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నదంటేనే ఆ జట్టును ఆటగాళ్లను గౌరవించాలి. మరోవైపు టీమిండియా ఘన విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగి కీలక పాత్ర పోషించారు. అయితే, ఇక్కడే ఓ చిన్న లోపం కనిపించింది. అదే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైఫల్యం.

రాహుల్ పై రివ్యూకు ఒత్తిడి చేసి ఉంటే ప్రతిభావంతుడైన కేఎల్ రాహుల్ టీమిండియాలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ కాలంలో అతడు కొన్ని మంచి ఇన్నింగ్స్ లు ఆడినా.. ఐపీఎల్ లో అదరగొడుతున్నా.. అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. అయితే, రెండేళ్లుగా నిలకడ చూపుతూ వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. రోహిత్, కోహ్లిల శకం ముగిశాక రాహుల్ కెప్టెన్ కావడం ఖాయం.

కానీ, దీనికిముందు అతడు కనీసం జట్టులో చోటైనా నిలుపుకోవాలి. కాగా, టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 12 బంతుల్లో 4 పరుగులే చేసి వెనుదిరిగిన కేఎల్‌ రాహుల్‌..పసికూన నెదర్లాండ్స్‌తో పోరులోనైనా ఫామ్‌ను అందుకుంటాడని భావిస్తే 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మేకరన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే.. దురదృష్టం కూడా అతడిని వెంటాడింది. బౌలర్ అప్పీల్ అనంతరం అంపైర్ ఎల్బీ ప్రకటించాక.. రాహుల్ సమీక్ష కోరలేదు. కొద్దిసేపు అవతలి ఎండ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ తో మాట్లాడి వెనుదిరిగాడు. ఒకవేళ సమీక్ష కోరి ఉంటే రాహుల్‌ నాటౌట్ గా మిగిలేవాడే.

అవకాశాలు ఉండగా.. ఆలోచించడం ఎందుకు?నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో రివ్యూ కోరకపోవడంలో రాహుల్ ది ఎంత తప్పో.. అతడికి తర్వాత తెలిసి ఉంటుంది. పసికూన జట్టుపై రాణించి ఆత్మవిశ్వాసంతో తదుపరి దక్షిణాఫ్రికాను ఎదుర్కొనే అవకాశాన్ని రాహుల్ చేజార్చుకున్నాడు. అందులోనూ ఫామ్ లేమితో ఉన్న అతడికి ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం. రిషభ్ పంత్, దీపక్ హుడా వంటి ఆటగాళ్లను బెంచ్ కు పరిమితం చేసి తనను ఆడిస్తున్న విషయాన్ని రాహుల్ గుర్తించే ఉంటాడు. ఇది కూడా అతడిపై ఒత్తిడి పెంచుతుంది. మరోవైపు వైస్ కెప్టెన్ కావడంతో తప్పనిసరిగా ఆడించాల్సిన పరిస్థితి.అయితే, ఇదేమీ కచ్చితం కాదు. వైస్ కెప్టెన్ అయినప్పటికీ తుది జట్టు నుంచి పక్కనపెట్టిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.

రోహిత్ కెప్టెన్ గా ఇదేనా తీరు?నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో రాహుల్ తొలి ఓవర్లలోనే ఔటయ్యాడు. వాస్తవానికి అతడు రివ్యూ కోరి ఉంటే బతికిపోయేవాడే. అప్పటికీ.. బంతి వికెట్ల నుంచి పక్కకు పోతోందని రోహిత్‌ అతడితో చెప్పినట్లు అనిపించింది. కానీ ఎందుకో రాహుల్‌ సమీక్ష అడగలేదు. చివరకు చూస్తే.. బంతి లెగ్‌స్టంప్‌ తాకకుండా వెళ్లేదని రీప్లేల్లో తేలింది. కాగా, ఇక్కడ చెప్పాల్సిందేమంటే రాహుల్ రివ్యూ కోరాలా? వద్దా? అని ఆలోచిస్తున్న సమయంలో రోహిత్ కెప్టెన్ గా చొరవ తీసుకుని రివ్యూ అడిగి ఉంటే బాగుండేది.

ఇది పోయినా.. మరో 2 రివ్యూలు ఉండేవి. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో వాటిని ఉపయోగించుకునే అవకాశమూ రాలేదు. కానీ, రోహిత్ అలా చేయలేదు. రాహుల్ కూడా మౌనంగా వెళ్లిపోయాడు. అయితే, మరికాసేపటికే రోహిత్ ను అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు.కానీ.. ఆ వెంటనే రోహిత్ రివ్యూ కోరాడు. మ్యాచ్ చూసినవారికి ఇది చాలా ఎబ్బెట్టుగానూ అనిపించింది. రోహిత్ కెప్టెన్ అయి ఉండీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఏదేమైనా..మ్యాచ్ లో తప్పులు సహజం. వాటిని సరిదిద్దుకుని మళ్లీ జరగకుండా చూడడం ముఖ్యం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.