Begin typing your search above and press return to search.

అప్పుడు దుర్గాదేవి..ఇప్పుడు దేశం మీదే పోస్టర్

By:  Tupaki Desk   |   28 Feb 2016 9:15 AM GMT
అప్పుడు దుర్గాదేవి..ఇప్పుడు దేశం మీదే పోస్టర్
X
భావస్వేచ్ఛ పేరిట చేసే పనులు ఎంత దుర్మార్గంగా ఉంటాయన్న విషయం ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహణ విషయం బయటకు పొక్కిన తర్వాత తేలింది. ఈ వ్యవహారంలో పలువురిపై రాజద్రోహం కేసు నమోదు చేసి.. వారిని అరెస్ట్ చేయటం.. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్.. కమ్యూనిస్టులు ఆందోళనలు చేపట్టటం తెలిసిందే. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడి.. రాజకీయ పార్టీలన్నీ ఈ విషయాన్ని తమ పరపతి అంశంగా భావించటంతో ఎవరూ ఎంతకీ తగ్గని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. జేఎన్ యూలో అసలేం జరుగుతుందో తెలుసా అంటూ.. దుర్గాదేవిని ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారన్న విషయాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో చెబుతుంటూ విన్న సగటు భారతీయుల గుండె మండిపోయింది.

ఆమె ప్రసంగాన్ని లైవ్ లో వినని వారు.. పక్కరోజు పత్రికల్లో చదివి షాక్ తిన్న పరిస్థితి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. దుర్గాదేవి మీద వేసిన పోస్టర్ తరహాలోనే.. మరో బరితెగింపు పోస్టర్ ను జేఎన్ యూ విద్యార్థులు వేయటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అక్కడి విద్యార్థులు కొందరు దేశం మీదనే ఒక పోస్టర్ వేయటం గమనార్హం.

‘‘ఇండియా ఓ జైలు’’ అంటూ గోడల మీద వేసిన పోస్టర్ ఇప్పుడు కలకలంగా మారింది. ఈ పోస్టర్ లో మోడీ సర్కారును విమర్శించటం.. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పరజలు మరో దేశంలో ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యల్ని పోస్టర్ ద్వారా వినిపించారు.

ఈ పోస్టర్ సమాచారం గురించి తెలిసి పోలీసులు.. పోస్టర్ వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయం మీద దృష్టి సారించారు. ఈ పోస్టర్ ను ప్రింట్ తీసిన జిరాక్స్ షాపు (ఈ షాపు వర్సిటీ బయటే ఉంది) యజమానిని విచారిస్తున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని ఒక కొలిక్కి తెస్తామని పోలీసులు చెబుతున్నారు. సరిగ్గా ఒక చూపు చూస్తే జేఎన్ యూలో ఇలాంటివెన్ని బయటకు వస్తాయో..?