Begin typing your search above and press return to search.

చైనాతో యుద్ధానికి మనం రెడీయేనా?

By:  Tupaki Desk   |   28 July 2016 6:18 AM GMT
చైనాతో యుద్ధానికి మనం రెడీయేనా?
X
తాజా పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణమైనా చైనాతో యుద్ధం వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో కవ్విస్తున్న చైనా ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దుల్లోనూ కాలు దువ్వుతోంది. అరుణాచల్ తమదేనని వాదిస్తున్న చైనా ఇప్పుడు ఉత్తరాఖండ్‌ విషయంలోనూ వివాదం రేపాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19న బెర్హోతీ వద్ద చైనా దళాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. కొందరు సైనికులు సరిహద్దు దాటి రావడంతో పాటు… చైనాకి చెందిన విమానాలు దాదాపు 5 నిమిషాలకు పైగా చక్కర్లు కొట్టినట్టు తెలిపింది. ఈ నెల మొదట్లోనే ఈ విషయమై వార్తలు రాగా బుధవారం ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌ ధృవీకరించారు. సరిహద్దు వెంబడి చైనా తన సైనికబలగాలను పెంచు తున్నాయని చెప్పారు.

అంతేకాదు... ఇటీవల ఉత్తరాఖండ్ రెవెన్యూ అధికారులు బర్హోతికి వెళ్లినప్పుడు వారిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా చైనా సైనికులు సైగలు - హెచ్చరికలు చేశారని ఉత్తరాఖండ్‌ పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలోనూ చైనా పలుమార్లు ఉత్తరాఖండ్‌ లోకి ప్రవేశించి ఆ దేశం పేరుతో బోర్డులు పెట్టింది. చైనా చొరబాటుపై కేంద్ర హోం శాఖకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) నివేదిక పంపింది. దీనికి ముందు నెల రోజుల క్రితం చైనా యుద్ధ విమానం ఒకటి ఆక్సాయ్‌- చైనా ప్రాంతంలో భారత సరిహద్దు దాటి వచ్చినట్టు కథానాలు వెలువడ్డాయి.

జూన్‌ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ లో చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకు రావడంతో ఇరుదేశాల బలగాల మధ్య ఉద్రిక్తత తలెత్తిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌ - ఉత్తరాఖండ్‌ లతో కూడిన మూడు సరిహద్దు పోస్టుల్లో బర్హోటీ ఒకటి. 2000 సంవత్సరం జూన్‌ లో అప్పటి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయంతో ఐటీబీపీ జవాన్లు ఆయుధాలతో వెళ్లడానికి అనుమతిలేదు. 1958లో ఇరుదేశాలు దీన్ని వివాదాస్పద ప్రాంతంగా గుర్తించాయి. 80 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన బర్హోటీ ప్రాంతంలోకి ఇరుదేశాలు తమ సైన్యాలను పంపకూడదు. 1962 యుద్ధంలో చైనా సైన్యం పశ్చిమాన లడఖ్‌ - తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ ల పైనే దృష్టిపెట్టింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ లోని ఈ ప్రాంతాన్ని చైనా టార్గెట్ చేయడంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ ఏర్పడింది.

పైగా ఇండియాలో ప్రస్తుతం రక్షణ పరంగా బలహీనంగా ఉందనడానికి కొన్ని ఉదంతాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. విమాన వాహక నౌక ఒక్కటి కూడా లేకపోవడం... వాయుసేన విమానాలు ప్రమాదానికి గురవుతూ వాయుసేన డొల్లతనాన్ని సూచిస్తుండడంతో భారత్ రక్షణ పరంగా బలహీనంగా ఉందన్న సంకేతాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో చైనా ఇలా కాలు దువ్వుతుండడం ఆందోళనకరమేనని అంటున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో యుద్దం వస్తే మనం సిద్ధమేనా అన్నది సందేహంగా మారింది.