Begin typing your search above and press return to search.

కరోనాపై భారత్ అలర్ట్.. ఆ దేశాల నుంచే వారికి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి..!

By:  Tupaki Desk   |   30 Dec 2022 12:30 AM GMT
కరోనాపై భారత్ అలర్ట్.. ఆ దేశాల నుంచే వారికి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి..!
X
చైనాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే చైనాతో సరిహద్దు పంచుకుంటున్న భారత్ కరోనా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్రంలో ఇటీవల అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్కులు ధరించాలని సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

భారత్ లో కరోనా వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది. రోజువారీ పాజిటివ్ రేట్ 0.11 శాతంగా నమోదవుతోంది. మరోవైపు భారతీయుల్లో 98 శాతం ప్రజలకు కోవిడ్ ను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి వచ్చిందని భారత కోవిడ్ ప్యానల్ ఎక్స్ పర్ట్ చీఫ్ ఎన్ కే అరోడా వెల్లడించారు. కొత్త వేరియంట్లతో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచనలు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టును తప్పనిసరిగా చేసింది. కొత్త ఏడాది నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు.

చైనా.. హంకాంగ్.. జపాన్.. దక్షిణ కొరియా.. సింగపూర్.. థాయ్ లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు ముందుగా ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వైరస్ నెగిటివ్ రిపోర్టును తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మాండవీయ వెల్లడించారు.

ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఈ పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్ట్ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాగా ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో రెండు శాతం మందికి రాండమ్ పరీక్షల నిబంధనలకు ఇది అదనమని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

చైనాలో కరోనా కేసులు దృష్ట్యా రాబోయే 40 రోజులు కీలకం కానున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. అయితే దేశంలో కోవిడ్ వేవ్ మరోసారి వచ్చినప్పటికీ ఈసారి వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.