Begin typing your search above and press return to search.

1962 ఓకే.. 1967ను మ‌ర్చిపోవ‌ద్దు

By:  Tupaki Desk   |   13 July 2017 6:02 AM GMT
1962 ఓకే.. 1967ను మ‌ర్చిపోవ‌ద్దు
X
చైనాతో ఏదైనా పేచీ వ‌చ్చిన వెంట‌నే.. 1962ను గుర్తు చేసేసి.. కాస్త ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ట్లుగా చెప్పే మేధావులు మ‌న చుట్టూ క‌నిపిస్తుంటారు. వారికి దేశం మీద ప్రేమ ఉండ‌ద‌ని చెప్ప‌టం లేదు కానీ.. చేదు అనుభ‌వాన్ని అదే ప‌నిగా తలుచుకుంటూ.. తొంద‌ర‌ప‌డి రిస్క్ ఎందుకు మీద‌కు తెచ్చుకోవ‌ట‌మ‌న్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ క‌నిపిస్తుంది. శ‌త్రువు బ‌ల‌వంతుడా? కాదా? అన్న‌ది ప‌క్క‌న పెట్టి.. దేశ‌ ప్ర‌యోజ‌నాల యాంగిల్ లో మాత్ర‌మే ఆలోచిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ.. చాలామంది చైనా పేరు ప్ర‌స్తావ‌న వ‌చ్చినంత‌నే 1962 నాటి చేదు అనుభ‌వాన్ని అదే ప‌నిగా గుర్తు చేసుకుంటూ ఉంటారు.

అయితే.. ఇలాంటి వారికి 1967లో చైనాను మ‌నం దెబ్బేసిన ముచ్చ‌ట‌ను గుర్తు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 1962లో టిబెట్ ప్రాంతంలో మ‌న స‌రిహ‌ద్దును భారీ ఎత్తున పోగొట్టుకున్న చేదు అనుభ‌వాన్ని అదే ప‌నిగా గుర్తు చేసుకుంటూ వెన‌క్కి త‌గ్గే బ‌దులు.. 1967లో సిక్కింలోని నాథులా సెక్టార్ లో చైనా సైన్యాన్ని భార‌త్ చావుదెబ్బ తీసిన వైనాన్ని గుర్తు చేసుకుంటే స‌రిగ్గా కొట్టాలే కానీ చైనాకు మ‌రీ అంత‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

చ‌రిత్ర పెద్ద‌గా గుర్తు పెట్టుకోని 1967 నాటి విజయాన్ని... తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రోసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇంత‌కీ అప్ప‌ట్లో ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని చూస్తే..

1967 ఆగ‌స్టులో సిక్కిం సెక్టార్ లోని నాథులా మార్గం స‌మీపానికి చైనా సైన్యం ర‌హ‌స్యంగా చొచ్చుకు వ‌చ్చింది. భార‌త భూభాగంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డ‌ట‌మే కాదు.. కంద‌కాల‌ను కూడా త‌వ్వింది. దీన్ని గుర్తించిన భార‌త సైన్యం.. చైనా తీరును త‌ప్పు ప‌ట్టి.. ఆ ప‌నుల్ని నిలిపివేయాల‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ తొండి చైనా ఆ మాట‌ల్ని ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది. అంతేనా.. భార‌త ద‌ళాల‌పై కాల్పులు షురూ చేసింది.

నాథులా మార్గం కీల‌కం కావ‌టం.. దాన్ని స్వాధీనం చేసుకుంటూ సిక్కింని త‌మ అధీనంలోకి తీసుకోవ‌చ్చ‌న్న‌ది చైనా దుర్మార్గ ఆలోచ‌న‌. ఈ నేప‌థ్యంలో భార‌త నాయ‌క‌త్వం వెంట‌నే రంగంలోకి దిగింది. చైనా ఆలోచ‌న‌ల‌కు చెక్ పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసింది. చైనా కాల్పుల్ని తిప్పి కొడుతూ దాడులు మొద‌లు పెట్టింది. వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో భార‌త ద‌ళాల థాటికి చైనీయులు త‌ట్టుకోలేక‌పోయారు.

భార‌త భూభాగాన్ని ఆక్ర‌మించుకోవాల‌న్న దుష్ట ఆలోచ‌న‌ను వ‌దిలి.. ప్రాణ‌భ‌యంతో వెన‌క్కి త‌గ్గి పారిపోయారు. ఈ యుద్ధంలో భార‌త సైన్యం 88 మంది జ‌వాన్ల‌ను పోగొట్టుకుంటే.. చైనా సైనికులు 450 మంది హ‌తం కావ‌టం గ‌మ‌నార్హం. ఇదే రీతిలో చోలా లా మార్గంలోనూ భార‌త సైన్యం బుద్ది చెప్ప‌టంతో చైనా సైన్యం తోక ముడిచింది. అయితే.. ఈ యుద్ధం వివ‌రాలు పెద్ద‌గా ప్ర‌చారం రాక‌పోవ‌టంతో భార‌త వీరోచిత విజ‌యం పెద్ద‌గా పాపుల‌ర్ కాలేదు.