Begin typing your search above and press return to search.

కోహ్లీ మార్కు ప్ర‌తీకార‌మంటే ఇదేనేమో!

By:  Tupaki Desk   |   7 March 2017 1:29 PM GMT
కోహ్లీ మార్కు ప్ర‌తీకార‌మంటే ఇదేనేమో!
X
భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న ఆస్ట్రేలియా జ‌ట్టుకు టీమిండియా గ‌ట్టిగానే జ‌వాబిచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్‌ లో భాగంగా తొలి టెస్టులో ఘోర ప‌రాజ‌యం పాలైన కోహ్లీ సేన‌... వెనువెంట‌నే జూలు విదిల్చింద‌నే చెప్పాలి. అది కూడా కంగూరులు త‌మ స్పిన్ బౌలింగ్ తో టీమిండియాకు చుక్క‌లుల చూపిస్తే... కోహ్లీ సేన కూడా అదే స్పిన్ అస్త్రంతో ఆస్ట్రేలియా జ‌ట్టును చిత్తు చేసింది. బెంగ‌ళూరులో కాసేప‌టి క్రితం ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 75 ప‌రుగుల తేడాతో ప‌ర్యాట‌క జ‌ట్టుపై ఘ‌న విజ‌యం సాధించింది. టెస్టు జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి కోహ్లీకి ఎదుర‌న్న‌దే లేదు. అయితే కోహ్లీ దూకుడుకు మొన్నటి పుణే టెస్టులో కంగారూలు బ్రేకులేశారు. ఇక బెంగ‌ళూరులో మొద‌లైన రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 189 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఫార్మాట్ ఏదైనా త‌న‌దైన శైలిలో బ్యాటును ఝుళిపిస్తున్న కెప్టెన్ కోహ్లీ కూడా టీమిండియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 12 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. దీంతో రెండో టెస్టులోనూ టీమిండియా ప‌రాజ‌యం దిశ‌గా సాగుతోంద‌న్న భావ‌న వ్య‌క్తం కాగా... అస‌లు కోహ్లీ సేన‌కు ఏమైంద‌ని స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని తెగ బాధ ప‌డిపోయాడు.

ఆ ఆవేద‌న‌ను మ్యాచ్ ముగియ‌క ముందే కోహ్లీ గ్ర‌హించిన‌ట్టే ఉన్నాడు. త‌న జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి జూలు విదిల్చాడు. త‌మ‌ను తొలి టెస్టు ఆసీస్ జ‌ట్టు ఏ అస్త్రంతోనైతే దెబ్బ‌కొట్టిందే... కోహ్లీ కూడా అదే అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశాడు. ఆసీస్ ను చావు దెబ్బ కొట్టేశాడు. ఫ‌లితంగా ఒక్క మ్యాచ్ ఓటమి త‌న‌ను ఎంత‌గా బాధ‌పెట్టిందో... కోహ్లీ త‌న క్విక్ రియాక్ష‌న్‌తో తేల్చి చెప్పేశాడు. ఇక రెండో టెస్టులో ఇరు జ‌ట్ల స్కోరు వివ‌రాలు చూస్తే... ఫ‌స్ట్ టెస్టులో ఓడి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకుని 189 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జ‌ట్టు 276 ప‌రుగులు చేసింది. ఈ క్ర‌మంలో ఫాలో ఆన్ ప్ర‌మాదంలో ప‌డ్డ టీమిండియా కాస్త జాగ్ర‌త్త‌గా ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 274 ప‌రుగులు చేసింది. ఈ నేప‌థ్యంలో రెండో టెస్టులోనూ కోహ్లీ సేన‌కు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ పైకి కోహ్లీ త‌న తురుపు ముక్క‌ను రంగంలోకి దించాడు. టీమిండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్‌గా ఇప్ప‌టికే ప‌లు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో విజ‌యాలు అందించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌న మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అత‌డి స్పిన్‌ కు త‌డ‌బ‌డ్డ ఆసీస్ బ్యాట్స్‌మెన్ ట‌ప‌ట‌పా పెవిల‌లియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఒక్క అశ్వినే ఏకంగా ఆరు వికెట్లు కూల‌గొట్టాడు. ఫ‌లితంగా ఆసీస్ త‌న రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 112 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. వెర‌సి టీమిండియా రెండో టెస్టును 75 ప‌రుగుల తేడాతో గెలిచేసింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను రెండో టెస్టు ముగిసేస‌రికి స‌మ‌యం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/