Begin typing your search above and press return to search.

దుమ్ములేపిన భారత్.. కబడ్డీ విశ్వవిజేత!

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:39 PM GMT
దుమ్ములేపిన భారత్.. కబడ్డీ విశ్వవిజేత!
X
ప్రపంచకప్‌ కబడ్డీ - 2016 పోటీల్లో భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది. కబడ్డీకి పుట్టినిళ్లు అయిన భారత్ ఈ పోటీల్లో విశ్వ విజేతగా నిలవడం ఇది మూడోసారి. శనివారం రాత్రి ఇరాన్‌ తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ లో ఫస్టాఫ్ లో ఎదురైన ఒత్తిడికి ఏమాత్రం లెక్కచేయకుండా - సెకండాఫ్ లో ప్రత్యర్ధిపై ఒత్తిడిని జయించిన భారత్‌ 9 పాయింట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఫస్టాఫ్ లో 13-18తో వెనుకంజలో నిలిచిన భారత్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని భావించిన ఇరాన్ జట్టుకు ద్వితీయార్ధంలో చుక్కలు చూపించిన భారత్ రెచ్చిపోయింది. అటు డిఫెండర్లు - ఇటు రైడర్లు సమష్టిగా రాణించడంతో మ్యాచ్‌ ను 38-29తో గెలుపుగా ముగించింది.

ఒక దశలో ఇరాన్ 10-07పాయింట్లతో లీడ్ లో ఉండగా... ఒక సూపర్ టాకిల్ తో భారత్ తిరిగి ఫాం అందుకుంది. ఇక రెండో అర్ధభాగం ప్రారంభం నుంచి భారత ఆటగాళ్లకు బోనస్ పాయింట్లను సాధ్యమైనంత వరకూ ఇవ్వకుండా ఉండటానికి ఇరాన్ ప్రయత్నించినప్పటికీ ఎదురుదాడికి దిగిన భారత ఆటగాళ్లు 21-20తో ఆధిక్యం సంపాదించారు. ఇక అక్కడనుంచి ఏమాత్రం వెనక్కి తగ్గని భారత ఆటగాళ్లు ప్రతీ రైడ్ లోనూ తమదైన ప్రదర్శనను కనబరిచారు. భారత్ ఆటగాళ్లలో ఒక దశలో అజయ్ ఠాకూర్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడమే కాక ఇరాన్ ను అలౌట్ చేసి భారత ఆధిక్యాన్ని 24-21కి తీసుకెళ్లాడు. అక్కడితో ఏమాత్రం వెనక్కి తగ్గని అజయ్.. మ్యాచ్ మొత్తం మీద 10కి పైగా రైడ్ పాయింట్లు సాధించి ఇరాన్ నడ్డివిరచడంలో కీలక పాత్ర పోషించాడు.

అత్యంత రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లోని ఆఖరి రెండు నిమిషాల్లో రైడింగ్ వెళ్లిన ఇరాన్ ఆటగాడు మీరాజ్ మెరుపు విన్యాసంతో రెండు పాయింట్లు సాధించి ఇరాన్ శిబిరంలో ఆశలు నింపే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో ఇరాన్ ఆశలను ఆడియాసలు అవ్వగా... దుమ్ములేపిన భారత్ 38-29 తేడాతో వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/