Begin typing your search above and press return to search.

రద్దయిన పెద్ద నోట్లు ఏమయ్యాయో తెలిస్తే షాకే..

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:01 PM GMT
రద్దయిన పెద్ద నోట్లు ఏమయ్యాయో తెలిస్తే షాకే..
X
పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తవుతోంది. బ్యాంకుల ముందు జనం బారులు తీరి 2 వేల రూపాయల నోటొకటి దొరికితే మహాప్రసాదం అనుకుని తెచ్చుకుని.. ఆ నోటుకి చిల్లర కోసం కాళ్లరిగేలా తిరిగి రోజులను ఎవరూ మర్చిపోలేదు. అదే సమయంలో తమ వద్ద ఉన్న అప్పటి రూ.500 నోట్లు - రూ.వెయ్యి నోట్లను బ్యాంకుల్లో వేయడం కూడా ఎవరూ మర్చిపోలేదు. డెడ్ లైన్ పెట్టడంతో జనం పడిన హడావుడి కూడా అంతా ఇంతా కాదు. ఇప్పుడంతా సద్దుమణిగిపోయింది కానీ సరిగ్గా ఏడాది కిందటి రోజులను తలచుకుంటే మాత్రం ఏం జరుగుతోందో తెలియని ఒక గందరగోళ పరిస్థితే కళ్ల ముందు మెదులుతుంది. జరిగిందేదో జరిగిపోయింది కానీ... అసలు అప్పుడు రద్దు చేసిన నోట్లన్నీ ఏమయ్యాయన్న ప్రశ్న చాలామంది మెదళ్లను తొలుస్తోంది. మరి, దానికి సమాధానం.. ? కేరళలోని ఓ ఫ్లైవుడ్ కంపెనీ దానికి సమాధానం చెప్తోంది. పచ్చనోట్లన్నీ చిత్తుకాగితాల్లా మారి చివరకు అట్టముక్కలు(హార్డ్ బోర్డు)గా మారాయని వారు చెప్తున్నారు.

అలా రద్దయిన పెద్ద నోట్లతో తయారైన హార్డుబోర్డులన్నీ ఇప్పుడు దక్షిణాప్రికాలో ఉన్నాయట. ఇంకో విశేషమేంటంటే మనతో పాటే 2019లో దక్షిణాప్రికాలో జరగబోయే ఎన్నికల్లో ఇవి కీలక పాత్ర పోషించబోతున్నాయట. అదెలానో తెలుసా.. ఈ బోర్డులను ఎన్నికల ప్రచారంలో వాడుతున్నారట. మన పాత నోట్ల‌న్నింటినీ రీసైకిల్ చేసి ప్ర‌చారం కోసం ఉప‌యోగించే హార్డ్‌ బోర్డ్‌ లుగా మార్చారు.

కేర‌ళ‌లోని క‌న్నూర్ ప్రాంతంలో ఉన్న వెస్ట్ర‌న్ ఇండియ‌న్ ప్లైవుడ్ లిమిటెడ్ కంపెనీకి ఈ ఆర్డరు వచ్చింది. దాదాపు 800 ట‌న్నుల పాత నోట్లు రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి ఆ కంపెనీకి చేరగా వారు దాన్ని హార్డ్‌బోర్డులుగా మార్చి ద‌క్షిణాఫ్రికా పంపించారట. మొత్తానికి కోట్ల రూపాయల విలువ చేసే మన సొమ్మంతా ఇప్పుడు ఇలా అయిందన్నమాట.