Begin typing your search above and press return to search.

కోహ్లి కి దిమ్మదిరిగినట్లుందే..

By:  Tupaki Desk   |   17 Aug 2015 11:43 AM GMT
కోహ్లి కి దిమ్మదిరిగినట్లుందే..
X
‘‘ఐదుగురు బౌలర్ల వ్యూహానికి నేను ఫేవరెట్. మ్యాచ్ లు గెలవాలంటే.. 20 వికెట్లు పడగొట్టాలంటే.. ఐదుగురు బౌలర్లుండాల్సిందే’’ అని కెప్టెన్ అయిన నాటి నుంచి ఊదరగొట్టేస్తున్నాడు విరాట్ కోహ్లి. కెప్టెన్ గా పూర్తి స్థాయి బాధ్యతలు అదుకున్న వెంటనే బంగ్లాదేశ్ తో ఏకైక టెస్టు మ్యాచ్ లో తన కూర్పును అమల్లో పెట్టాడు కోహ్లి. కానీ వర్షం వల్ల మ్యాచ్ సజావుగా సాగకపోవడంతో దాని ఫలితమేంటో తెలియలేదు. ఇప్పుడిక శ్రీలంకతో టెస్టు సిరీస్ తొలి మ్యాచ్ లో మళ్లీ ఐదుగురు బౌలర్ల తో దిగాడు. కానీ ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియాకు షాక్ ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. కోహ్లి ఐదుగురు బౌలర్లను ఎంచుకోవడం ఈ మ్యాచ్ లో పరోక్షంగా భారత్ ను దెబ్బతీసిందనడంలో సందేహం లేదు.

ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల తో బరిలోకి దిగితే సరిపోయేదేమో. మూడో స్పిన్నర్ గా హర్భజన్ ను కూడా ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ తో ఏకైక టెస్టులో కానీ.. లంకతో తొలి టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కానీ హర్భజన్ పెద్దగా ప్రభావం చూపలేదు. అతను బంతిని స్పిన్ చేయలేకపోతున్న సంగతి స్పష్టంగా తెలిసిపోతోంది. అయినా అతడికి అవకాశమిచ్చాడు. కానీ అతను ఘోరంగా విఫలమయ్యాడు. అశ్విన్ రెండు ఇన్నింగ్సు ల్లో కలిపి 10 వికెట్లు తీస్తే హర్భజన్ ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. హర్భజన్ బదులు పుజారా లాంటి ఓ బ్యాట్స్ మన్ ను అదనంగా తీసుకుని ఉంటే రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను గట్టెక్కించి ఉండేవాడేమో. పుజారాను కాదని రోహిత్ ను మీద అతి నమ్మకం పెట్టుకుంటే అతను ముంచేశాడు. పుజారా మధ్యలో ఫామ్ కోల్పోయి ఉండొచ్చు కానీ.. రోహిత్ తో పోలిస్తే టెస్టు ల్లో అతడే నమ్మదగ్గ ఆటగాడు. ద్రవిడ్ లా నిలబడాల్సిన పరిస్థితి వస్తే పుజారాను నమ్మొచ్చు కానీ.. రోహిత్ ను కాదు. మొత్తానికి కోహ్లి టీమ్ సెలక్షన్ తొలి టెస్టులో బెడిసికొట్టింది. దీంతో అర్జెంటుగా ఆలోచనలు మార్చుకుంటున్నట్లున్నాడు.