Begin typing your search above and press return to search.

అణు యుద్ధం వ‌స్తే పైచేయి పాక్‌ దా..భార‌త్‌ దా..!

By:  Tupaki Desk   |   3 Sep 2019 2:30 PM GMT
అణు యుద్ధం వ‌స్తే పైచేయి పాక్‌ దా..భార‌త్‌ దా..!
X
అణు యుద్ధం.... గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో భాగంగా వస్తున్న హెచ్చరిక. ఈ హెచ్చరిక రావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం. ఎప్పుడైతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి పాకిస్థాన్ ఇండియాపై విమర్శలు చేస్తూనే ఉంది. పైగా ఈ అంశాన్ని అంతర్జాతీయంగా ఎత్తి చూపి ప్రపంచ దేశాల మద్దతు కూడబెట్టాలని అనుకుంది. కానీ ఆ ప్రయత్నాలకు ఇండియా గండికొట్టింది. జమ్మూ-కశ్మీర్ విషయంలో అగ్ర దేశాలు - ఆసియా దేశాలు మోడీ ప్రభుత్వానికే మద్ధతు తెలిపాయి.

దీంతో ఇంకా అసహనం పెంచుకున్న పాక్ జమ్మూ కశ్మీర్ హక్కుల కాపాడటం కోసం అణు యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటనలు చేస్తోంది. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ - ఆ దేశ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తూ ఇండియాని రెచ్చగొడుతున్నారు. ఇదే సమయంలో పాక్ అణు యుద్ధానికి సిద్ధమైతే పరిస్థితి ఎలా ? ఉంటుందనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ రెండు దేశాల మధ్య అణుయుద్ధం అనివార్యమైతే ఎవరిది పై చేయి అవుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై ఈ ఫిబ్రవరిలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తమ దేశ సైనికులకు వివరించాడు.

ఇండియాతో అణు యుద్ధానికి వెళితే పాకిస్థాన్ అనే ఒక దేశముందని భవిష్యత్ లో పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుందని చెప్పాడు. పాక్ ఒక్క అణుబాంబు వేస్తే దానికి బదులుగా భారత్ 20 అణుబాంబులు వేసి పాకిస్థాన్‌ ని ప్రపంచ పటంలో లేకుండా తుడిచిపెట్టేస్తుందని హెచ్చరించాడు. అలా కాకుండా ఉండాలంటే పాక్ ఒక్కసారిగా 50 అణుబాంబులతో భారత్ పై దాడి చేసి నాశనం చేయాలని చెప్పాడు. అయితే అలా చేయడం పాకిస్థాన్ కు సులువా? అంటే కాదనే చెప్పాలి.

ప్రపంచంలో అణుబాంబులు ఎక్కువ కలిగి ఉన్న దేశం రష్యా. ఆ దేశం వద్ద 6,490 అణుబాంబులు ఉన్నాయి. దీని తర్వాత అమెరికా వద్ద 6,185 ఉన్నాయి. అలాగే ఫ్రాన్స్ వద్ద 300 - బ్రిటన్ వద్ద 200 అణుబాంబులు ఉన్నాయి. చైనా వద్ద 290 అణుబాంబులు ఉంటే.. పాకిస్థాన్ వద్ద 160 - భారత్ వద్ద 140 దాకా ఉన్నట్లు ఒక అంచనా. దీని బట్టి చూస్తే భారత్ కంటే పాక్ వద్దే ఎక్కువ అణుబాంబులు కలిగిఉన్నాయి. మామూలుగా అణు యుద్ధం కాకుండా సంప్రదాయక పద్ధతిలో యుద్ధంలో జరిగితే భారత్ దే పూర్తి ఆధిపత్యం. అలా అని అణుబాంబులు తక్కువ ఉన్న అణుబాంబులని ప్రయోగించడంలో భారత్ కు గట్టి సత్తా ఉంది. అణుశక్తి బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి ఐఎన్ ఎస్ అరిహంత్‌ - నేల - నింగి - సముద్రం నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే శక్తి భారత్ కు ఉంది.

ఇలా అణుబాంబులని ప్రయోగించే సత్తా లేనప్పటికీ పాక్‌ ని తక్కువ అంచనా వేయలేం. పాకిస్తాన్ వ‌ద్ద‌ షాహీన్ 3 లాంటి మిసైల్స్ ఉన్నాయి. దాంతో అది అండమాన్ దీవులపై కూడా అణుబాంబులు ప్రయోగించగలదు. మొత్తం మీద చూసుకుంటే రెండు దేశాలు అణుబాంబులని సమర్ధవంతంగా ప్రయోగించగలిగేవే. కాకపోతే అణుబాంబులని ప్రయోగించడం కంటే ముందు వాటిని కాపాడుకోవడం భారత్ కంటే పాకిస్థాన్ కు పెద్ద సవాలు. ఎందుకంటే పాక్ తన అణ్వస్త్రాలను దాచిన ప్రాంతాలని అమెరికా రక్షణ నిపుణులు ఎప్పుడో బయటపెట్టారు.

వాళ్ళ అంచనా ప్రకారం పాక్ అణ్వస్త్రాలను దాచిన ప్రాంతాలు 9. అవి వచ్చి 1. ఆక్రో గారిసన్ (సింధ్) 2. గుజ్రాన్ వాలా గారిసన్ (పంజాబ్) 3. ఖుజ్ దార్ గారిసన్ (బలూచిస్థాన్) 4. మస్ రూర్ డిపో (కరాచీ) 5. నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ (ఫతేజంగ్) 6. పానో అకిల్ గారిసన‌ (సింధ్) 7. సర్గోదా డిపో (పంజాబ్) 8. తార్బాలా (ఖైబర్ ఫక్తూన్ ఖ్వా) 9. వాహ్ ఆర్డనన్స్ ఫెసిలిటీ (పంజాబ్). వీటి మీద భారత్ ఒక్కసారి గురి పెడితే పాకిస్థాన్ శూన్యమే. మొత్తం మీద చూసుకుంటే అణుయుద్ధానికి వెళితే పాకిస్థాన్ కొంపే మునుగుతుంది. అందుకే భారత్-పాక్ కు యుద్ధం రాకుండా అగ్రరాజ్యాలు ఆపే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పాక్ కవ్వింపు చర్యలకు దిగితే చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఉంది మోడీ ప్రభుత్వం కదా...!