Begin typing your search above and press return to search.
చైనాకు చెక్..శ్రీలంక ఎయిర్ పోర్ట్ పై భారత్ కన్ను
By: Tupaki Desk | 13 Oct 2017 12:14 PM GMTఇటీవలి కాలంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నచైనాకు సరైన సమయంలో గట్టి షాకిచ్చేందుకు మనదేశం సిద్ధమైంది. హిందూ మహాసముద్రంలో చైనా రోజురోజుకూ బలపడుతుండటం ఇండియాతోపాటు పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి చెక్ పెట్టడానికి ఇండియా ఇప్పుడు మరో ప్లాన్ వేసింది. శ్రీలంకకు భారంగా మారిన మట్టల ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని ఇండియా చూస్తోంది. ఈ ఎయిర్ పోర్ట్ చైనా నిర్మించిన హంబన్ తోట పోర్ట్ కు సమీపంలో ఉంది. అందుకే వ్యూహాత్మకంగానే నష్టాల్లో ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ బాధ్యతను ఇండియా తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అతి తక్కువ రద్దీ కలిగిన ఎయిర్ పోర్ట్ గా మట్టల నిలిచింది. దీనికి రోజూ దుబాయ్ నుంచి మాత్రమే ఒక్క విమానం వస్తుంది. అయితే చైనా నిర్మించి, 99 ఏళ్లకు లీజు తీసుకున్న హంబన్ తోట పోర్ట్ కు దగ్గర్లో ఉండటంతో భారత్ కావాలనే ఈ ఎయిర్ పోర్ట్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే చర్చలు నడుస్తున్నట్లు శ్రీలంక పౌర విమానయాన శాఖ మంత్రి నిర్మల్ సిరిపాల వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి భారత విదేశాంగ శాఖ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఈ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి 29.3 కోట్ల డాలర్లు అవసరం కాగా.. అందులో 70 శాతం పెట్టుబడితో 40 ఏళ్ల కాలానికి ఇండియా లీజుకు తీసుకోనుంది. ఈ ఎయిర్ పోర్ట్ ను గతంలో చైనానే 25 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించింది. ఇప్పుడు దాని బాధ్యతలను కూడా తీసుకోవాలని భావించినా రెండు దేశాల మధ్య అవగాహన కుదరలేదు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తీసుకొని అక్కడ ఫ్లయింగ్ స్కూల్ తోపాటు మెయింటెనెన్స్ హబ్ ఏర్పాటు చేసి ఎయిర్ పోర్ట్ ఆదాయం పెంచాలన్నది భారత్ ఆలోచన. భారత పర్యాటకులకు కూడా దీనిని ఓ పర్యాటక ప్రదేశంగా మార్చాలని భావిస్తున్నారు. ఇండియా ఈ ఎయిర్ పోర్ట్ ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉందని తమకు తెలియదని చైనా చెప్తోంది.