Begin typing your search above and press return to search.

వైరస్ ను అరికట్టడంలో మోడీ సర్కార్ విఫలమైంది!

By:  Tupaki Desk   |   26 May 2020 10:10 AM GMT
వైరస్ ను అరికట్టడంలో మోడీ సర్కార్ విఫలమైంది!
X
దేశంలో ప్రస్తుతం అలజడి సృష్టిస్తున్న వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌ డౌన్‌ ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ విమర్శించారు. అలాగే లాక్ ‌డౌన్‌ ఎగ్జిట్‌లో నరేంద్ర మోడీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందన్నారు. లాక్‌ డౌన్‌ ఉద్దేశ్యం - లక్ష్యం నెరవేరలేదన్నారు. ఈ నేపథ్యంలో విజృంభిస్తున్న వైరస్ ను అరికట్టేందుకు ప్లాన్‌ బి ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. గత రెండు నెలలుగా లాక్ ‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ దేశంలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయని అయన చెప్పారు.

మంగళవారం ట్విటర్‌ ద్వారా ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో రాహుల్‌ లైవ్ ‌లో మాట్లాడుతూ ఈ విధమైన పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఒకవైపు వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండగా లాక్‌ డౌన్‌ కు సడలింపులు ఇచ్చిన ఏకైక దేశం భారత్‌ అని , లాక్ ‌డౌన్‌ ప్రకటించేప్పుడు కూడా ప్రణాళిక లేకుండా ప్రకటించారని - దీని కారణంగా వలసకార్మికులు - రోజువారీ కూలీలు - చిన్న వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారని రాహుల్‌ గాంధీ అన్నారు.

అలాగే దేశంలో రోజురోజుకి వైరస్ కేసులు పెరుగుతుంటే .. మహమ్మారి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని మోదీ - అతని సలహా సిబ్బంది అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క సోమవారం రోజున దాదాపు 7000 కొత్త కేసులు నమోదయ్యాయని - ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని తెలిపారు. మంగళవారం నాటికి దేశంలో 1.45 లక్షల కేసులు దాటాయని, వైరస్‌ బారిన పడి 4167 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

ఇప్పుడు లాక్‌ డౌన్‌ విఫలమవ్వడంతో ప్రభుత్వ వ్యూహం ఏంటో తెలుసుకోవాలి. కేంద్రం తన ప్లాన్‌ బి ని తెలియజేయాలి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కరోనా సంక్షోభంలో పేద ప్రజలను ఆదుకునేందుకు నేరుగా వారికి నగదు అందిస్తున్నాము. ఆ రాష్ట్రంలో మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడం లేదు. ఇప్పుడు కేంద్ర సహాయం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు, వలసదారులకు మద్దతు ఇస్తునప్పటికీ, మన రాష్ట్రాలకు కేంద్రం నుంచి మాత్రం మద్దతు లభించడం లేదు' అని రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు.