Begin typing your search above and press return to search.

ఐరాస వేదికిగా పాక్ పై భారత్ నిప్పులు!

By:  Tupaki Desk   |   23 Sep 2016 4:26 AM GMT
ఐరాస వేదికిగా పాక్ పై భారత్ నిప్పులు!
X
చెప్పేవి శ్రీరంగ నీతులు... దూరేవి *** అన్నట్లు.. ఈ మధ్యకాలంలో ఏ వేదికపై ప్రసంగించే అవకాశం వచ్చినా కశ్మీర్ లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, ఆ ప్రాంతంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని కబుర్లు చెబుతున్నారు నవాజ్ షరీఫ్. తాజాగా యురి ఉగ్రవాద దాడి అనంతరం ఈ చిలకపలుకులు మరింతగా పెరిగిపోయాయి. తాజాగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా భారత్ పై రకరకాల ఆరోపణలు చేస్తూ, కశ్మీర్ అంశాన్ని ప్రపంచ సమస్యగా చూపించే ప్రయత్నం చేసిన పాక్ పై భారత్ నిప్పులు చెరిగింది. కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుబట్టిన భారత్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా పాక్ ప్రధాని మాట్లాడారని మండిపడింది.

71వ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన భారత్... ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో తన వాదనను బలంగా వినిపించింది. ప్రపంచంలో తీవ్రవాదానికి పాకిస్తాన్ కేంద్ర బిందువు అయ్యిందని మొదలుపెట్టిన భారత్... భారత్ లోని కాశ్మీర్ లో శాంతి భద్రతలు అదుపుతప్పాయని చెబుతూ, మానవహక్కుల గురించి అలాంటి పాకిస్థాన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడింది. అంతర్జాతీయంగా అందుతున్న సహాయసహకారాలను దుర్వినియోగం చేసే క్రమంలో, వాటిని ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇవ్వడానికి, వారిని పెంచిపోషించడానికి ఉపయోగిస్తుందని భారత్ గుర్తుచేసింది.

ఇదే క్రమంలో క్రమక్రమంగా డోసు పెంచిన భారత్... కశ్మీర్ లో తీవ్రవాద చర్యల నుంచి భారత పౌరులను రక్షించడానికి భారత్ సిద్దంగా ఉందని.. ఉగ్రవాదుల అడ్డగా మారిపోయిన పాక్ - బయటమాత్రం నీతివంతమైన దేశమని చెప్పుకు తిరుగుతుందని ఎద్దేవా చేసింది. తీవ్రవాది - హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ ని ఐరాస సాక్షిగా అమరవీరుడు అని పాక్ ప్రధాని చెప్పడం సిగ్గుచేటు అని.. తీవ్రవాదులను అమరవీరులుగా కీర్తించడం వంటి సిగ్గుమాలిన పని భారత్ ఎప్పటికీ చెయ్యదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్న నాయకులు పాక్ లో స్వేచ్చగా తిరుగుతున్నా పాకిస్థాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచానికి మరోసారి చెప్పింది. ఈ రేంజ్ లో పాక్ ప్రవర్తనను ఎండగడుతూ - భారత్ చేసిన వ్యాఖ్యలతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారనే చెప్పాలి. దీంతో.. ప్రపంచ వేదికపై భారత్ తన వాదనను గట్టిగా వినిపించడమే కాకుండా.. పాక్ వక్రబుద్ధిని - ద్వంద్వ వైఖరినీ మరోసారి ప్రపంచానికి చూపించినట్లయ్యింది.