Begin typing your search above and press return to search.

లోక‌నాయ‌కుడా.. ఏమిటీ మాట‌ల మంట‌లు?

By:  Tupaki Desk   |   13 May 2019 10:39 AM GMT
లోక‌నాయ‌కుడా.. ఏమిటీ మాట‌ల మంట‌లు?
X
నాయకుడు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఇక‌.. అధినాయ‌కుడు మ‌రింత బాధ్య‌త అవ‌స‌రం. అందుకు భిన్నంగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మేఎక్కువ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తాజాగా లోక నాయ‌కుడిగా సినీ ప్ర‌పంచంలో ముద్దుగా పిలిచే క‌మ‌ల‌హాసన్ ఈ మ‌ధ్య‌నే మ‌క్క‌ళ్ నీది మ‌య్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే.

తాజాగా ఆయ‌న మంట పుట్టేలా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అర‌వ‌క్కురిచ్చి లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్న ఆయ‌న‌.. దేశంలో మొట్ట‌మొద‌టి ఉగ్ర‌వాది హిందూ వ్య‌క్తి నాథూరామ్ గాడ్సేగా పేర్కొన్నారు. గాంధీజీని హ‌త్య చేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్ర‌వాదం షురూ అయిన‌ట్లుగా పేర్కొని సంచ‌ల‌నం సృష్టించారు.

అర‌క్కురిచ్చిలో ముస్లింలు ఎక్కువ‌మంది ఉంటార‌న్న ఉద్దేశంతో తానీ వ్యాఖ్య‌లు చేయ‌టం లేద‌న్న క‌మ‌ల్ హాస‌న్.. తాను గాంధీ విగ్ర‌హం ముందు నిల‌బ‌డి ఒక మాట చెబుతున్న‌ట్లుగా చెప్పిన మాట‌లు క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత మొట్ట‌మొద‌టి ఉగ్ర‌వాది హిందూవ్య‌క్తి గాడ్సేన‌ని తేల్చి చెప్పారు.

గాంధీని హ‌త్య చేసిన త‌ర్వాతే ఉగ్ర‌వాదం మొద‌లైంద‌న్నారు. తాను చెప్పిన మాట‌ను ఎక్క‌డైనా చెబుతాన‌ని చెప్పిన క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు విబేధిస్తున్నారు. గాడ్సే హ‌త్య వెనుక ఆయ‌న ఒక్క‌రే త‌ప్పించి మ‌రెవ‌రూ లేర‌న్నది ఒక విష‌యం కాగా.. గాడ్సే ఆఖ‌రి లేఖలో తాను హ‌త్య చేయ‌టానికి దారి తీసిన కార‌ణాల్ని ఆయ‌న స్ప‌ష్టంగా వెల్ల‌డించ‌టాన్ని మ‌ర్చిపోలేం. గాడ్సే దురాగ‌తాన్ని ఒక మ‌తానికి అంటించ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఈ త‌ర‌హా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు క‌మ‌ల్ హాస‌న్ కు రాజ‌కీయంగా లాభం తెస్తాయా? లేదా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. కొత్త తర‌హా ఆందోళ‌న‌ల‌కు క‌మ‌ల్ కార‌ణ‌మవుతార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌మ‌ల్ హాస‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లు హిందూ సంఘాలు.. పార్టీలు ఖండించాయి. ఒక వ్య‌క్తి చేసిన త‌ప్పును ఒక మ‌తానికి.. కులానికి అంటించ‌టం త‌గ‌ద‌న్న చిన్న విష‌యం లోక నాయ‌కుడికి తెలీక‌పోవ‌టం ఏమిటో?