Begin typing your search above and press return to search.

యోగా.. హెల్తే కాదు వెల్త్ కూడా

By:  Tupaki Desk   |   22 Jun 2016 11:30 AM GMT
యోగా.. హెల్తే కాదు వెల్త్ కూడా
X
భారత్ కు అంతర్జాతీయంగా ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ప్రధాన అంశాల్లో యోగా కూడా ఒకటి. భారత్ కే ప్రత్యేకమైన యోగ కళకు ఇప్పుడు ప్రపంచం జేజేలు కొడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండింగ్ చేస్తుండడంతో ఇది మరింత ఊపందుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తూ ప్రపంచమంతా యోగాకు దాసోహమైంది. ఖండాంతరాలకు పాకిన యోగా ఇప్పుడు ఇంటర్నేషనల్ గా మంచి మార్కెట్ అంశంగానూ మారిపోయింది. ఇప్పటికే యోగా బేస్డ్ మార్కెట్ విస్తరించిన క్రమంలో తాజా బ్రాండింగ్ తో అది మరింత పెరగనుంది. అంతేకాదు... ప్రపంచవ్యాప్తంగా యోగా గొప్ప కెరీర్ గానూ మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యోగా వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

- ప్రపంచవ్యాప్తంగా యోగా ఆధారిత వ్యాపారం విలువ 80 బిలియన్ డాలర్లు అంటే... సుమారు 5 లక్షల 40 వేల కోట్ల కోట్లు రూపాయలు.

- ఆయుర్వేదం - యోగా - నేచురోపతి వంటి రంగాల్లో ఏటా ఒక్క ఇండియాలోనే 12 వేల కోట్ల టర్నోవర్ జరుగుతోంది.

- ఇండియాలో వెల్ నెస్ ఇండస్ర్టీ వేల్యూ 49 వేల కోట్ల రూపాయలు

- ఇక యోగా గురువు రాందేవ్ బాబా నిర్వహిస్తున్న పతంజలి ఆయుర్వేద వస్తువుల వ్యాపారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015-16లో పతంజలి 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసింది.

- కేవలం అమెరికాలో యోగా ఇండస్ట్రీ 27 బిలియన్ డాలర్ల మార్కెట్ కలిగి ఉంది. అంటే... 1.8 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట.

- అమెరికాలో యోగా ప్రాక్టీస్ చేసే వారి సంఖ్య 2 కోట్ల 40 లక్షలు

- 2014 లెక్కల ప్రకారం యోగా క్లాసుల కోసం అమెరికన్లు చేస్తున్న ఖర్చు సుమారు 75 వేల కోట్ల రూపాయలు

యోగా కొందరు భారతీయులకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. అలా ఇంటర్నేషనల్ గా పాపులర్ అయిన యోగా గురువులు యోగా ఆధారిత వ్యాపారాలు - ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. వారి వ్యాపారం - ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే.

- యోగి హర్భజన్ సింగ్(2004లో చనిపోయారు). కుండలిని యోగా స్పెషలిస్ట్. సెక్యూరిటీ సిస్టమ్సు వ్యాపారం ఉండేది. ఏడాదికి 1 బిలియన్ డాలర్ల ఆదాయం ఉండేది.

- బాబా రాందేవ్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పతంజలి యోగాలో సిద్ధ హస్తుడు. రియల్ ఎస్టేట్ - ఆర్గానిక్ వస్తువులు - యోగా వ్యాపారం ఉంది. వ్యాపారం విలువ 5 వేల కోట్లు రూపాయలు

- భరత్ ఠాకూర్..(హీరోయిన్ భూమిక భర్త). ఆర్టిస్టిక్ యోగాలో స్పెషలిస్ట్. యోగా కేంద్రాలు నిర్వహించడంతో పాటు ప్యాకేజ్డ్ వాటర్ - సినిమా నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్నారు. వ్యాపారం విలువ 100 మిలియన్ డాలర్లు.

- ధీరేంద్ర బ్రహ్మచారి... హఠయోగాలో నిపుణుడు. రియల్ ఎస్టేట్ - యోగా కేంద్రాల వ్యాపారంతో పాటు తుపాకుల తయారీ కర్మాగారం కూడా ఉంది. 500 కోట్ల వ్యాపారం ఆయనది.

-- అమెరికాలో ఉండే బిక్రమ్ చౌదరి ఆస్తుల విలువ 75 మిలియన్ డాలర్లు. ఈయన యోగా పేరు బిక్రమ్ యోగానే. ఈయనకు యోగా స్కూల్సు ఉన్నాయి. దీంతోపాటు పలు ఉత్పత్తులు - యోగా విధానాలకు పేటెంటు తీసుకుని ఆ రాయల్టీలతో ఆర్జిస్తున్నారు.

- శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ.... ఆర్టు ఆఫ్ లివింగ్ ఈయన విధానం. ఆరోగ్య కేంద్రాలు - యోగా క్లాసులు - ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులతో పాటు ఫార్మసీలు కూడా నిర్వహిస్తున్నారు. 1100 కోట్ల ఆదాయం ఏటా ఉంటోంది.

.. ఈ యోగా గురువులకు వివిధ ప్రభుత్వాలు చేకూర్చిన లబ్ధి తక్కువేం కాదు. భూములు - ఆశ్రమాలతో పాటు రాయితీలు ఇతర రూపాల్లో భారీ లబ్ధి చేకూరుస్తున్నారు. అవన్నీ లెక్కిస్తే వారి ఆదాయం మరింతగా ఉంటుంది.

అలా అని యోగా అంటే వ్యాపారం ఒక్కటే కాదు... దానికున్న ప్రాముఖ్యం తక్కువేం కాదు. యోగా గురువులు ప్రపంచంపై చూపిన ప్రభావమూ తక్కువ కాదు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ యాపిల్ కు సీఈఓగా గతంలో పనిచేసి స్టీవ్ జాబ్స్ వంటి గొప్ప మేధావి - నిపుణుడు కూడా ఇలాంటి గురువులను ఆదర్శంగా తీసుకున్నారు. స్టీవ్ జాబ్స్ బతికున్న రోజుల్లో ఆయన ఐప్యాడ్ లో ఒకే ఒక్క ఈ బుక్ ఉండేదట. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఆయన మళ్లీమళ్లీ ఆ పుస్తకాన్ని చదువుకుని స్ఫూర్తి - ప్రశాంతత - మార్గదర్శకత్వం పొందేవారట. ఇంతకీ ఆ పుస్తకమేంటో తెలుసా...? ‘‘ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’’.. అదేనండీ ‘‘ఒక యోగి ఆత్మకథ’’. క్రియాయోగను విశ్వవ్యాప్తం చేసి... వివేకానందుడి తరువాత ప్రపంచదేశాల్లో ఆ స్థాయి అందుకున్న పరమహంస యోగానంద స్వీయ చరిత్ర పుస్తకం. భారతీయ యోగాకు - గురువులకు ఉన్న శక్తి అదన్నమాట. వారు ప్రపంచానికి చూపిన దారి అలాంటిదన్నమాట.

-- గరుడ