Begin typing your search above and press return to search.

చైనా అధినేత రావటానికి ముందే స్ట్రాంగ్ వార్నింగ్

By:  Tupaki Desk   |   10 Oct 2019 5:54 AM GMT
చైనా అధినేత రావటానికి ముందే స్ట్రాంగ్ వార్నింగ్
X
ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన వైఖరి ఉంటే మాటలు ఎప్పుడు సూటిగా ఉంటాయి. కశ్మీర్ అంశంపై తొలి నుంచి స్పష్టమైన వైఖరితో ఉన్న మోడీ సర్కారుకు.. గతంలోని ప్రభుత్వాలకు మధ్య పోలికే లేదని చెప్పాలి. కశ్మీర్ అంశంలో ఏం చేయాలన్న దానిపై విపరీతమైన గందరగోళం గత ప్రభుత్వాల్లో ఉండేది. అందుకు భిన్నంగా మోడీ సర్కారు మాత్రం.. కశ్మీర్ అంశంపై కచ్ఛితంగా ఉండటమే కాదు.. ఈ ఇష్యూలో తమ ఎజెండా ఏమిటన్న విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసిన పరిస్థితి.

ఆర్టికల్ 370 నిర్వీర్యం లాంటి చారిత్రక నిర్ణయాన్ని తీసుకోవటానికి తమకెంత ధైర్యం ఉందన్న విషయాన్ని చెప్పేసిన మోడీ సర్కారు.. తదనంతర పరిణామాల్ని ఫేస్ చేయటానికి పక్కా ప్లాన్ చేసిందని చెప్పాలి. గతంలో మాదిరి కశ్మీర్ అంశంపై ఏ ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తరచూ స్పష్టం చేసింది. మరో రోజులో భారత్ లో రెండు రోజులు పర్యటించేందుకు వస్తున్న చైనా అధినేత జిన్ పింగ్ వస్తున్న వేళ.. ఎలాంటి మొహమాటాలకు తావివ్వని రీతిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది.

భారత్ లో పర్యటించటానికి ముందు పాక్ లో పర్యటిస్తున్న చైనా అధినేత.. ఇమ్రాన్ తో భేటీ కావటం.. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై కీలక చర్చలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై భారత్ తీవ్ర ఆగ్రహంతో పాటు.. అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కశ్మీర్ భారత్ అంతర్భాగమని తేల్చి చెప్పిన భారత విదేశాంగ శాఖ.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చైనా.. పాక్ లకు గట్టి వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.

సాధారణంగా చైనా లాంటి దేశాధినేత భారత్ పర్యటించటానికి వస్తున్నారంటే.. ఇంత ఘాటుగా హెచ్చరిక ఇవ్వటానికి వెనుకాడుతారు. అందుకు భిన్నంగా భారత్ మాత్రం తన స్టాండ్ ను స్పష్టం చేసింది. కశ్మీర్ విషయంలో బారత్ ఎంత క్లియర్ గా ఉందన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. ఆయన ఏదైనా చెప్పే వీలు లేదన్న అంశాన్ని అర్థమయ్యేలా తాజా ప్రకటన చేసిందని చెప్పాలి.

చైనా అధ్యక్షుడు.. పాక్ ప్రధాని మధ్య జరిగిన సమావేశంలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్న వార్తను తాము చూశామని.. జమ్ముకశ్మీర్ భారత్ లో అంతర్భాగమన్న దానిపై తమ దేశం స్థిరమైన.. స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాలు మాట్లాడాల్సిన అవసరం లేదంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఘాటుగా బదులిచ్చారు.